
తెలంగాణ బిల్లు సభలోకి రానివ్వకుండా చేయగలిగాం
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును రానీవ్వకుండా చేయగలిగామని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి అన్నారు. లోక్సభ వాయిదా అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 70-80మంది సభ్యులు మద్దతు ఉందన్నారు. స్పీకర్ ముందు అనేక విషయాలను లేవనెత్తామని సబ్బం హరి తెలిపారు. ప్రజలు జరుగుతున్న విషయాన్ని చూస్తున్నారని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళతామని .... విభజనపై కేంద్ర వైఖరిని వారికి తెలియచేస్తామని సబ్బం హరి తెలిపారు.
కాగా లోక్సభలో ఈరోజు లోక్పాల్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. దాంతో సోనియా వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా జరుగుతుందంటూ ఆమె....కేంద్రమంత్రి కమల్నాథ్ను ప్రశ్నించారు. ఎంపీలు సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ నినాదాలు చేశారు. సీమాంధ్ర ఎంపీల నినాదాల మధ్యే లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందింది.