సాక్షి, మంచిర్యాల : తెలంగాణ బిల్లుపై ‘ఢిల్లీ’ రాజకీయాలు జిల్లా ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. మంగళవారం టీ- బిల్లుపై కసరత్తు పూర్తి చేసినా జీవోఎం సభ్యులు పలు సవరణలు చేశారు. బుధవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకావడం, ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవే శపెడతామని స్వయంగా ప్రధాని ప్రకటించడంతో తెలంగాణ ఏర్పడడం తథ్యమని జిల్లా వాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 6న కేబినెట్ ముందుకు బిల్లు ప్రవేశపెట్టి.. 10న రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రె స్ ప్రకటించడంతో రాష్ట్రం ఏర్పాటు ఖాయమని ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాలుగా చేసిన ఫలించనుందని సంబరాలకు సిద్ధమవుతున్నారు. మరోపక్క జీవోఎం సమావేశం అనంతరం వారంలోగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్న వెంటనే ఢిలీల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు జిల్లా ప్రజల్లో ఉత్కంఠకు గురిచేశాయి. తెలంగాణ ఏర్పాటు ఖాయమని ప్రజాప్రతినిధులు చెప్పుకొస్తున్నా ప్రజలు మాత్రం బిల్లు పాసయ్యే వరకు చెప్పలేమంటున్నారు.
మారిన పరిణామాలపై ఆందోళన
ఎట్టి పరిస్థితిలోనూ టీ-బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు స్పష్టం చేయడం.. సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న సీఎం కిర ణ్ బుధవారం జంతర్‌మంతర్ వద్ద మౌనదీక్ష చేపట్టనుండటంతో జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న పార్టీ నాయకులను కలిసి పార్లమెంటులో బిల్లుకు మద్దతిచ్చే విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. హోం శాఖ కార్యాలయంలో జరిగిన జీవోఎం సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు జై రాం రమేశ్, నారాయణస్వామి, షిండే, ఆంటోనీలను అడ్డుకున్నారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఇంట్లో ఎన్డీఏ మిత్రపక్షాలూ సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు.
శాసనసభలో బిల్లు తిరస్కరణకు గురైనా.. పార్లమెంటులో పాస్ అవుతుందని ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ ఎమ్మెల్యేలంతా గత నెల 31న ఢిల్లీకి వెళ్లి మకాం వేశారు. వీరితో పాటే టీ- కాంగ్రెస్ నేతలందరూ హస్తినకు బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర ఎంపీలతో పార్లమెంట్ వ్యవహారాల ఇన్‌చార్జి కమల్‌నాథ్‌తో జరగనున్న భేటీపై అందరి దృష్టి పడింది.
శరవేగంగా మారుతున్న ఢిల్లీ రాజకీయాలపై జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాల్లో ఏ సమయంలో ఎలా మార్పు వస్తుంది? పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీల మద్దతు లభిస్తుందా? లేదా..? అని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు.
టీ-టెన్షన్
Published Wed, Feb 5 2014 4:53 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement