ఫిబ్రవరి రెండో వారంలో పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ : మలివిడత పార్లమెంట్ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ తెలిపారు. ఈ సమావేశాలు సుమారు 15 రోజులు పాటు జరుగుతాయని ఆయన బుధవారమిక్కడ పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఓటు ఆన్ అకౌంట్, రైల్వే బడ్జెట్, పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. కాగా తెలంగాణ బిల్లుపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు కమల్నాథ్ స్పందించలేదు.
సాధారణంగా శీతాకాల సమావేశాలు నెలపాటు నిర్వహిస్తారు. అయితే ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా సమావేశాల వ్యవధిని ప్రభుత్వం తగ్గించింది. దాంతో గత ఏడాది డిసెంబర్ 5 నుంచి ర్ 20 వరకు సమావేశాలను నిర్వహించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఉంటుందా...లేదా అనేది వేచి చూడాల్సిందే.