ఐబీ సదస్సులో ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఆసిఫ్ ఇబ్రహీం నుంచి జ్క్షాపికను అందుకుంటున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
-
వీటిపై రాజకీయంగా, పాలనాపరంగా, మేధోపరంగా యోచించి పరిష్కరించాలి
-
ఐబీ వార్షిక సదస్సులో రాష్ట్రపతి వ్యాఖ్య
-
1947లో దేశ విభజనే అనివార్యమైంది
-
నాడు 45 కోట్ల మందినే కలిపి ఉంచలేకపోయాం
-
నేడు 125 కోట్ల మందిని ఏ తీరున కలిపి ఉంచాలి?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటును, కొత్త రాష్ట్రాల కోసం వస్తున్న డిమాండ్లను రాజకీయంగా, పాలనాపరంగా, మేధోపరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని ముసాయిదా బిల్లును తయారుచేసి అభిప్రాయం కోసం రాష్ట్ర అసెంబ్లీకి పంపిన తరుణంలో ప్రణబ్ చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం ఢిల్లీలో జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) వార్షిక సదస్సులో ఆయన ప్రధానోపన్యాసం చేస్తూ అనేక అంశాలను స్పృశించారు. ప్రసంగంలో దేశ విభజనను సైతం ప్రస్తావించారు. సదస్సులో హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, హోంశాఖ సహాయమంత్రులు, కార్యదర్శి, ఐబీడెరైక్టర్ ఆసిఫ్ ఇబ్రహీం, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘‘1947లో దేశ జనాభా 45 కోట్లు. ఆ 45 కోట్ల మందిని కలిపి ఉంచలేకపోయారు. విభజన అవసరం వచ్చింది. కొత్త సార్వభౌమ దేశ ఏర్పాటు ఆవశ్యకత ఏర్పడింది.
ఆ సార్వభౌమ దేశం అలాగే ఉండగలిగిందా లేదా అనేది వేరే విషయం. కానీ, 45 కోట్ల మందిని కలిపి ఉంచడం కురదలేదన్నది మాత్రం కఠోర వాస్తవం. ఇప్పుడు 125 కోట్లకుపైగా ఉన్న జనాభాను మనం ఏ తీరున, ఏ రూపంలో కలిపి ఉంచాలి?’’ అని ప్రణబ్ ప్రశ్నించారు. అనంతరం ఆయన కొత్త రాష్ట్రాల కోసం తలెత్తుతున్న డిమాండ్లను ప్రస్తావిస్తూ, ‘‘కొత్త రాష్ట్రాల ఏర్పాటు, దానికోసం వస్తున్న డిమాండ్లు... వీటితో రాజకీయంగా, పాలనాపరంగా, మేధోపరంగా వ్యవహరించాల్సి ఉంటుంది’’ అని కీలక వ్యాఖ్య చేశారు. దేశంలో ఇప్పటికే ఉన్న కొత్త రాష్ట్రాల డిమాండ్లు, భవిష్యత్తులో తలెత్తే డిమాండ్లను ఏ విధంగా చూడాలి, వాటితో ఎలా వ్యవహరించాలనేదానిపై ఆయన తన మనోగతాన్ని ఈ వ్యాఖ్య రూపంలో వెల్లడించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మన ముందుకు మేధోపరంగా తీవ్ర సవాళ్లు వస్తున్నాయని, 125 ఏళ్ల చరిత్ర గల నిఘా సంస్థ వీటి విషయంలో ఎంతో జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు.
ఉగ్రవాదానికి బయటి మద్దతు: సైన్స్, ఐటీ రంగాల్లో ఎంతో పురోగతి రావడంతో ఉగ్రవాదం విసిరే సవాళ్లు కూడా చాలా పెద్ద రూపాన్ని సంతరించుకున్నాయని ప్రణబ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సరిహద్దు ఆవలి నుంచి వస్తున్న ఉగ్రవాదం రూపంలో దేశాన్ని వేధిస్తున్న ముప్పును వేలెత్తిచూపుతున్న దేశం భారత్ ఒక్కటేనంటూ ఆయన పరోక్షంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తప్పుపట్టారు. ‘‘సాంకేతిక పరిజ్ఞానంలో త్వరితగతిన వస్తున్న మార్పు కొత్త ముప్పులను కూడా కొనితెస్తోంది. సోషల్ మీడియా దుర్వినియోగమనేది నేడు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల చేతిలో ఆయుధంగా ఉంది. జాతివిద్రోహులు ఈ ఆయుధాన్ని మరింత అధునాతన పద్ధతుల్లో వాడుతున్నారు. అత్యాధునిక వ్యూహాలు, టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఈ ముప్పును తిప్పికొట్టాలి. కొత్త సవాళ్లు ఉత్పన్నమైనపుడు మనం కూడా మన నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాలను పెంపొందించుకోవడం ఎంతైనా అవసరం’’ అని ఆయన ఉద్బోధించారు.
హజారే ఉద్యమంతో ప్రజాస్వామ్యంలో కొత్త కోణాలు
అవినీతిరహిత సమాజం కోసం అన్నా హజారే చేసిన ఉద్యమాల వంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త కోణాలను ఆవిష్కరించాయని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. అటువంటి ఉద్యమాలను ఎవరూ పక్కనపెట్టలేరన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమనే సంప్రదాయ ఆలోచనా విధానంలో ప్రస్తుతం మార్పు వచ్చిందన్నారు. ఫలానా చట్టం కావాలని...దాన్ని ఫలానా రకంగానే ఆమోదించాలని సామాజికవేత్తలు, ఎన్జీవోలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలరని పదేళ్ల కిందటి వరకూ ఎవరూ ఊహించి ఉండరని పరోక్షంగా లోక్‌పాల్ బిల్లుపై డిమాండ్లను ఉదహరించారు.
‘‘సాధికారత అనేది అనేక అవకాశాలతోపాటు సవాళ్లనూ ముందుకు తెస్తుంది. ప్రజలకు సాధికారతనివ్వడం ద్వారా మన అభివృద్ధి వ్యూహంలో పెద్ద మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను అంగీకరిస్తున్నాను. అయితే ఉద్దేశాలను వ్యక్తీకరించడం ద్వారా కాకుండా చట్టాలు చేయడం ద్వారానే సాధికారతను అందించగలం’’ అని అన్నారు. ‘‘సమాచార హక్కు చట్టం చేతిలో ఆయుధంగా ఉన్నవారు ప్రభుత్వ వ్యవహారాలను బహిర్గతపరుస్తారు. ఫలానా సెక్షన్‌ని సవరించడం ద్వారా మనం సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. కానీ, ఈ చట్టాన్ని ప్రజలు సమర్థంగా ఉపయోగిస్తున్నారు, కొన్నిసార్లు దుర్వినియోగపరుస్తున్నారు కూడా. వాటిని ఎదుర్కోవాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ఆహార భద్రత, విద్యాహక్కు, ఉపాధి హక్కు... ఇవన్నీ మనం కల్పించాల్సినవని, వాటిని అందించడంతో వ్యవస్థ విసిరే సవాళ్లకు మనకు మనం జవాబు చెప్పాల్సిందేనన్నారు.