
కులభూషణ్ శవాన్ని పంపుతాం
ఏఐఎఫ్‌ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఫోటో సంచలనం రేపింది.
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్‌ఎఫ్) అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఫోటో సంచలనం రేపింది. పాకిస్తాన్‌లో ఉరిశిక్ష పడిన భారతీయుడు కులభూషణ్ జాధవ్ మృతదేహం పంపిస్తామంటూ అతడి ఫొటోతో పాటు భారత్‌కు వ్యతిరేకంగా మెసేజ్ పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. దుండగులు ఏఐఎఫ్‌ఎఫ్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఈ దురాగతానికి దిగినట్టు తేలింది.
‘కులభూషణ్ జాధవ్ తిరిగి రావాలని కోరుకుంటున్నారా? అతడి విడుదల కోసం డిమాండ్ చేస్తారా? కులభూషణ్ మృతదేహాన్ని పంపిస్తామ’ని దుండగులు సందేశం పోస్ట్ చేశారు. తమ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైందని ట్విటర్ ద్వారా ఏఐఎఫ్‌ఎఫ్ వెల్లడించింది. హ్యాకింగ్‌కు గురైన తర్వాత ఇంటర్నెట్ నుంచి ఏఐఎఫ్‌ఎఫ్ వెబ్‌సైట్ అదృశ్యమైంది. వెబ్‌సైట్‌ను త్వరలో పునరుద్ధరిస్తామని, అసౌకర్యానికి క్షమించాలని ఏఐఎఫ్‌ఎఫ్ పేర్కొంది. హ్యాకర్లు ఎవరనేది వెల్లడికాలేదు.