'పరీక్షలు రాశాం... పాస్ లేదా ఫెయిలా అనేది తెలుస్తుంది'
హైదరాబాద్ను అస్లెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం చేయాలని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరోసారి విజ్ఞప్తి చేసినట్లు కేంద్రం పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వెల్లడించారు. అలాగే ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న భద్రాచలాన్ని సీమాంధ్ర ప్రాంతంలో విలీనం చేయాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్ యూటీతో సహా అన్ని అంశాలను కూలంకుషంగా చర్చిస్తున్నట్లు సోనియా తనతో చెప్పారని చిరంజీవి పేర్కొన్నారు. శనివారం న్యూఢిల్లీలో సోనియాగాంధీతో చిరంజీవి భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
రాయలసీమ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్న రాయల తెలంగాణ అంశంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అది రాయలసీమా నేతల ఇష్టం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయని వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం తాము చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు ఆయన బల్లగుద్ది చెప్పారు. ఆ క్రమంలో తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని చిరంజీవి ఈ సందర్బంగా గుర్తు చేశారు.
అయితే విలేకర్ల సమావేశంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్బాబుపై చిరంజీవి కించిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య ఉద్యమం అంటు ఉద్యమాలు చేస్తున్న అశోక్బాబు ఏమైన తన పదవికి రాజీనామా చేశాడా అని చిరంజీవి ఎదురు ప్రశ్నించారు. చిత్తశుద్ధితో పని చేస్తున్న తమను కించపరచ వద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని వెల్లడించారు. పరీక్ష రాశాం... పాస్ లేదా ఫెయిలా అనేది.. త్వరలో తేలుతుందని చిరంజీవి ఈ సందర్బంగా చమత్కరించారు.