హైదరాబాద్‌ను యూటీగా చేయాలని కోరా::చిరు
ఢిల్లీ: హైదరాబాద్ నగరాన్ని యూటీ(కేంద్ర పాలిత ప్రాంతం)గా చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి తెలిపారు. శుక్రవారం సోనియాతో భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే సీమాంధ్రలో ఉద్యమ తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. దీంతో అక్కడి ప్రజలకు భరోసా కల్పించన వారుమవుతామని సోనియాకు విన్నవించానన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని తాను అనుకోవడం లేదన్నారు. సమన్యాయం చేయాలని ఆమెకు సూచించానన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో చోటు చేసుకున్న సమస్యను పరిష్కరిస్తానని సోనియా హామి ఇచ్చారన్నారు. ఆంటోని కమిటీ నివేదిక వచ్చే వరకూ విభజన ప్రక్రియ ముందుగా వెళ్లదని ఆయన తెలిపారు.