బికినీ- గోచీ పేచీ
సముద్రతీర అందాలకు నెలవైన గోవాలో బికినీ-గోచీ పేచీ కలకలం రేపింది. బీచుల్లో బికినీలను నిషేధించాలని ఓ మంత్రిగారంటే.. గోచీ పెట్టుకు తిరగడంటూ ఓ ఫ్యాషన్ డిజైనర్ రుసరుసలాడారు. దీంతో బికినీ-గోచీల చర్చ హాట్ టాఫిక్ గా మారింది.
గోవా పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేవి అందమైన బీచ్లు. అమ్మాయిలు బికినీలతో అరేబియా సముద్రంలో కేరింతలు కొడుతుండడం ఇక్కడ సర్వసాధారణం. అయితే బికినీ సంస్కృతితో తమ రాష్ట్రం భ్రష్టుపట్టిపడుతోందని ఆందోళన చెందిన గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్ దీన్ని నిషేధించాలని గళమెత్తారు. ఎక్కడపడితే అక్కడ ఇలా 'టూపీస్' స్కర్టులు వేసుకు రావడం గోవా సంస్కృతికి ఏమాత్రం సరిపోదని, ఇలాగే కొనసాగితే ఏమైపోవాలని వాపోయారు. తాము దీన్ని అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టారు.
బికినీ సంస్కృతిని నిషేధించాలన్న సుదీన్ దావలికర్ డిమాండ్పై ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ ఘాటుగా స్పందించారు. పాశ్చాత్య పోకడలను, సంస్కృతిని నిషేధించాలనుకుంటే మంత్రే గోచీ పెట్టుకు తిరగాలని ఆయనకు పరోక్షంగా సూచించారు. విదేశాల్లో తయారైన ఫ్యాంటు, చొక్కాలు తొడుక్కోవడం మానేసి, శాలువా కప్పుకుని మీ శాఖకు వెళ్లగలరా అంటూ బహిరంగ లేఖ రాశారు. ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని దావలికర్ కు కాంగ్రెస్ పార్టీ హితవు పలికింది.
టూరిజంపై అధిక ఆదాయం ఆర్జించే గోవా.. సుదీన్ దావలికర్ డిమాండ్ తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బికినీలను నిషేధించబోమని స్పష్టం చేసింది. బీచుల్లో బికినీ ధరించడాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకించడం లేదని గోవా సీఎం మనోహర్ పారికర్ అంటూ ఔదార్యం దాల్చడంతో వివాదం సద్దుమణిగింది. అయితే బికినీ-గోచీ పేచీ దేశంలోని అందరి దృష్టిని ఆకర్షించింది.