వెబ్ ఆప్షన్లు రేపటి నుంచి !
* ఇంజనీరింగ్ ప్రవేశాలపై నేడు అధికారిక ప్రకటన
* ప్రవేశాలకు మార్గం సుగమం చేసిన హైకోర్టు ధర్మాసనం
* సింగిల్ జడ్జి తీర్పు సవరణ.. పిటిషన్లు దాఖలు చేసుకున్న కాలేజీలకు వెబ్ కౌన్సెలింగ్‌లో చోటు
* తనిఖీల అనంతరం అఫిలియేషన్లపై తుది నిర్ణయం
* ఏఐసీటీఈ నుంచి ఇద్దరు, జేఎన్టీయూ నుంచి ఒకరితో 25 బృందాలు.. ఆగస్టు 1కల్లా తనిఖీలు పూర్తిచేయాలి
* అఫిలియేషన్ రాని కాలేజీల్లో చేరే విద్యార్థులను మరో కాలేజీలోకి మార్చాలని ఆదేశం
* తదుపరి విచారణ ఆగస్టు 3కు వాయిదా
* కోర్టు తీర్పు అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష
* నెలాఖరులోగా ప్రవేశాలు పూర్తి చేయాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం శుక్రవారం (ఈనెల 17) నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కాలేజీలకు అఫిలియేషన్ల వ్యవహారంపై బుధవారం హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, జేఎన్టీయూహెచ్ ఇన్‌చార్జి వీసీ శైలజారామయ్యర్, రిజిస్ట్రార్ ఎన్‌వీ రమణారావు తదితరులు హాజరైన ఈ సమావేశంలో... కోర్టులో జరిగిన వాదనలు, తీర్పు సారాంశం ప్రకారం ముందుకు సాగాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే హైకోర్టు తీర్పు కాపీ బుధవారం రాత్రి వరకు అధికారికంగా అందకపోవడంతో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. తీర్పు ప్రతిలో ఏముంటుందో తెలియదు కనుక.. అది అందిన వెంటనే దానిలోని అంశాలను బట్టి గురువారం అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో చర్చించి ప్రకటన జారీ చేయనున్నారు.
ఇక ఎంసెట్‌లో అర్హత సాధించిన 90,556 మంది విద్యార్థుల్లో 66,308 మంది ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఇక తదుపరి ప్రక్రియ వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు చేపట్టడమే. ఈ నేపథ్యంలో 17 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించి.. ఒకటీ రెండు దశల్లో ప్రవేశాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈనెల 31 నాటికి ప్రవేశాలను పూర్తిచేసి, ఆగస్టు 1న తరగతులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
తీర్పు ప్రతి కోసం..
మొదటి దశ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్, తర్వాతి రెండో దశ ప్రక్రియ తేదీలను గురువారం ఉన్నత విద్యా మండలి అధికారికంగా ప్రకటించనుంది. బుధవారమే కోర్టు తీర్పు ప్రతి అందితే షెడ్యూల్ ప్రకటించి గురువారం నుంచి ప్రక్రియ చేపట్టాలని షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ కోర్టు తీర్పు ప్రతి అందనందున 17 నుంచి ప్రక్రియ కొనసాగించేలా మార్పులు చేస్తున్నారు. దాని ప్రకారం... ఈ నెల 17 నుంచి 20 వరకు వెబ్‌ఆప్షన్లు, 21న ఆప్షన్లలో మార్పులు, 23న సీట్ల కేటాయింపు జరిపే అవకాశముంది. విద్యార్థులు 27 వరకు కాలేజీల్లో చేరేలా చర్యలు చేపట్టనున్నారు. రెండోదశలో 28, 29 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు, 30న సీట్ల కేటాయింపు, 31న కాలేజీల్లో చేరేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. మొత్తంగా ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించెందుకు యోచిస్తున్నారు.
20వ తేదీ నుంచి సంయుక్త తనిఖీలు
హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీ నుంచి ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్‌ల ఆధ్వర్యంలో కాలేజీల్లో తనిఖీలను చేపట్టనున్నారు. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలపై జేఎన్టీయూహెచ్ దృష్టి సారించింది. అఫిలియేషన్లు కోరుతూ, సీట్ల కోతను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో దాదాపు 25 బృందాలు ఈ తనిఖీలను చేపట్టనున్నాయి. ప్రతి కాలేజీకి తనిఖీలకు వెళ్లే తేదీ వివరాలను 48 గంటల ముందే తెలియజేసి మరీ సంయుక్త బృందాలు తనిఖీలకు వెళ్లేలా జేఎన్టీయూహెచ్ కసరత్తు చేస్తోంది.
విద్యార్థులకు పూర్తి వివరాలు తెలిసేలా..
మరోవైపు అదనపు సీట్లు, అఫిలియేషన్లు కోరుతూ కోర్టును ఆశ్రయించిన కాలేజీలు, బ్రాంచీలకు సంబంధించిన సమగ్ర సమాచారం విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలోనే తెలిసేలా చేర్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
తనిఖీలు వద్దు.. సీట్లూ వద్దు
66 కాలేజీల రాతపూర్వక విజ్ఞప్తులు
సాక్షి, హైదరాబాద్: అఫిలియేషన్లపై హైకోర్టును ఆశ్రయించిన కాలేజీలు.. ఇప్పుడు కోర్టు తీర్పు పర్యవసానాన్ని తలచుకుని వణికిపోతున్నాయి. ఇప్పటికే అనుబంధ గుర్తింపు పొందిన బ్రాంచీలకు సంబంధించిన ఫ్యాకల్టీ తదితర సదుపాయాల తాలుకు వివరాలను కూడా తెలుసుకునే వెసులుబాటును సంయుక్త తనిఖీ బృందాలకు హైకోర్టు ఇచ్చింది. దీంతో అదనపు బ్రాంచీలు, సీట్ల కోసం చూసుకొని ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ బృందాల తనిఖీలకు ఒప్పుకుంటే... ఇప్పటికే గుర్తింపు ఉన్న బ్రాంచీలు, సీట్లలో లోపాలు బయటపడతాయేమోనని కాలేజీలు ఆందోళనపడుతున్నాయి.
దీంతో కోర్టును ఆశ్రయించిన 120 కాలేజీల్లో 66 కాలేజీలు తమకు అదనపు సీట్లు వద్దు, సంయుక్త బృందాల తనిఖీలు వద్దంటూ జేఎన్టీయూహెచ్‌కు రాతపూర్వకంగా తెలియజేశాయి. కోర్టు తీర్పు వచ్చిన బుధవారమే 66 కాలేజీలు సీట్లు వద్దంటూ లేఖలు ఇవ్వగా.. తనిఖీలు ప్రారంభించే 20వ తేదీ నాటికి మరెన్ని కాలేజీలు ఇలా లేఖలు ఇచ్చే అవకాశముంది. దీనిని బట్టే ఇంజనీరింగ్ కాలేజీల్లో అనేక లోపాలు ఉన్నాయంటూ జేఎన్టీయూహెచ్ మొదటి నుంచీ చేస్తూ వస్తున్న వాదన వాస్తవమేనని స్పష్టమవుతోంది.
‘బ్రాంచీలు, సీట్లపై స్పష్టత ఇవ్వాలి’
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూల్‌ను ప్రకటించాలని ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి కోరారు. కోర్టు తీర్పు మేరకు వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టే కాలేజీలు, వాటిల్లోని బ్రాంచీలు, సీట్ల వివరాలు వెబ్ ఆప్షన్ల సమయంలోనే విద్యార్థులకు తెలిసేలా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సీట్లను ఎంచుకుంటే ఏయే షరతులు వర్తిస్తాయన్న వివరాలు అందులో ఉండేలా సాఫ్ట్‌వేర్ రూపొందించాలన్నారు. వీలైతే వాటిని ప్రత్యేకంగా, వేరుగా వెబ్ ఆప్షన్లలో పెట్టాలని చెప్పారు.