సాక్షి, న్యూఢిల్లీ: డేరా అన్న పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని అంటారు. డేరా అంటే తాత్కాలిక గుడారం లేదా తాత్కాలిక సమావేశ స్థలం. ఎండ తగులకుండా డేరాను వేసుకొని ప్రజలు లేదా ఆధ్యాత్మికవాదులు, తమ నాయకులు లేదా ఆధ్యాత్మిక గురువులు చెప్పే మాటాలను వినేందుకు ఈ డేరాల కింద సమావేశమయ్యేవారు. కాలక్రమంలో డేరాలకు శబ్దార్థం మారుతూ వచ్చింది. మజిలీ, మజ్లీస్ అని, అన్న పానీయాలు అందుబాటులో ఉండే చోట అనే అర్థం కూడా వచ్చింది. ఒకప్పుడు డేరాలంటే తాత్కాలికంగా తాళ్లతో కట్టేవే ఉండేవి. ఇవి కూడా ఆధునిక హంగులను పులుముకుని ఏసీ గదులుగా మారిపోయాయి.
ఏదేమైనా పంజాబ్ రాష్ట్రంలో విస్తరించిన డేరాలకు అర్థం చెప్పాలంటే ఆధ్యాత్మిక అంశాల గురించి బోధించే గురువుండే గుడారం. ఒక్కో ఆధ్యాత్మిక గురువుది ఒక్కో గుడారం. ప్రతి గుడారానికి ఓ పేరుంటుంది. గుళ్లు, గోపురాల్లాగే ఓ ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉండే ఈ డేరాలు, అంటే గుడారాలు చాలా చోట్ల సిమెంట్‌తో నిర్మించిన పక్కా మందిరాలుగా కూడా మారిపోయాయి. మతాలకు, డేరాలకు ప్రత్యక్ష సంబంధం ఏమీ ఉండదు. ఆయా మతాల విశ్వసించే గురువులనుబట్టి వారి బోధనలు ఉంటాయి. సిక్కు పవిత్ర గ్రంధం ‘గురు గ్రంథ్ సాహిబ్’ను నమ్మే గురువు ఆ గ్రంధంలో ఉన్న బోధనలే ప్రజలకు విడమర్చి చెప్పవచ్చు. సిక్కు మతాలే కాకుండా ఇతర మతాలకు చెందిన గురువులు కూడా పంజాబ్‌లో డేరాలను నిర్వహిస్తున్నారు.
పంజాబ్ రాష్ట్రంలో పదివేలకుపైగా డేరాలు ఉంటాయన్నది పంజాబ్ యూనివర్శిటీ పొలిటికల్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ పనిచేస్తున్న రోంకీ రామ్ అంచనా. అత్యాచారం కేసులో అరెస్టై జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌ది అందులో ఒక డేరా. డేరా సచ్ఛా సౌదా అన్నది దాని పేరు. ఆయన దేవుళ్లు, మతాలు అన్ని సమానమని చెప్పడానికే తన పేరును ‘గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్’గా మార్చుకున్నారు. డేరాలకు ఓ సిక్కు, క్రిస్టియన్, ముస్లిం లేదా బౌద్ధ మతస్థుడు ఎవరైన నాయకుడిగా అంటే గురువుగా ఉండవచ్చు. ఆ డేరాకు తానే గురువన్న హోదాలో ప్రజలకు ప్రబోధనలు చేయవచ్చు. లేదా ఫలానా గురువు వారసుడినంటూ బోధనలు చేయవచ్చు. ఉదాహరణకు డేరా సచ్‌ఖంద్ బల్లాన్ ‘రవిదాసియా ధర్మాన్ని’ పాటిస్తుంది. అంటే గురువు రవిదాస్ బోధనలను ఆచరిస్తోంది.
సచ్ఛా సౌధా, నిరంకారీస్, నాంధారీస్, బినియర్‌వాలా, రవిదాసియాస్, రాధా సోయామీస్ తదితర డేరాలను సిక్కు యేతర డేరాలుగా పరిగణిస్తారు. సచ్ఛా సౌధా, నిరంకారీస్ లాంటి డేరాలను సిక్కులు నిర్వహిస్తున్నప్పటికీ వాటిని సిక్కు డేరాలుగా గుర్తించడం లేదు. వారు సిక్కుల పవిత్ర గ్రంధాన్ని విశ్వసించి అందులోని బోధనలను చేయడం లేదు. వారు తమకు నచ్చిన అంశాలను నచ్చిన తీరుగా బోధిస్తున్నారు. ఎక్కువ వరకు చాలా డేరాల్లోని గురువులు అన్ని మతాల్లో ఉన్న మంచి అంశాలను ఎంపిక చేసుకొని బోధించడం వల్ల అవి ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అన్ని మతాల వారికి ఆహ్వానం ఉండడంతో డేరాలకు వెళ్లే ప్రజల సంఖ్య నానాటికి పెరుగుతూ వచ్చింది. ఫలానా మతం వారికంటూ గిరిగీసుకోక పోవడమే ఈ డేరాల గొప్ప గుణం.
దళితులే ప్రధానాకర్షణ
పంజాబ్ లాంటి రాష్ట్రంలో డేరాలకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం కొన్ని వందల సంవత్సరాలుగా దళితులను హిందూ, గురుద్వార్, చర్చి, మసీదుల్లోకి అనుమతించక పోవడమే. ఇప్పటికీ కూడా వారికి చాలా చోట్ల అనుమతి లేదు. దేశవ్యాప్తంగా సరసారి 16 శాతం దళితులుంటే ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే 33 నుంచి 34 శాతం మంది దళితులు ఉన్నారు. వీరికి డేరాల్లోకి అనుమతి ఉండడంతో వారు ఎక్కువగా డేరాల్లోకి ప్రవేశించడం ఆచారంగా మారింది. పైగా డేరాల్లో ఏ మతస్థులు కూడా తక్కువ కులాల వారిని తక్కువచేసే చూడరు. అలా చూడకూడదని, ప్రజలంతా సమ భావంతో మెలగాలని డేరాల్లో బోధిస్తారు. కనుక డేరాల సంస్కతి ఎక్కువగా నచ్చే ప్రజలు ఉన్నారు.
రాజకీయాలకు దూరంగా....
పంజాబ్ నుంచి హర్యానా వరకు విస్తరించిన డేరాలు సహజంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అందుకని చాలా డేరాలు సహజంగానే దూరంగా ఉంటాయి. కానీ అవి కూడా సమాజానికి లోపలే ఉండడం వల్ల సమాజం ప్రభావం వాటి మీద కూడా పడుతుంది. అందుకనే కొన్ని డేరాలు ఎన్నికల్లో ఫలానా రాజకీయ పార్టీకి ఓటేయండి అంటూ పిలుపు కూడా ఇస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా డేరాలను సందర్శిస్తారు. వారికి కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలసుకుంటారు. వాటిని తీరుస్తామని, అందుకు ప్రతిఫలంగా తమను గెలిపించాలని కోరుతుంటారు. ఇలా రాజకీయ నాయకులు, డేరాల గురువులు పరస్పరం సహకరించుకునే కొత్త సంస్కతి వేళ్లూనుకుంటోంది. హేతువాదిగా చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూడు డేరాలను సందర్శించారు. డేరాల మాటున చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు, అరెస్ట్ అవుతున్న వారు లేకపోలేదు. అయితే వారి సంఖ్య చాలా స్వల్పం.
డేరాలంటే ఏమిటీ? వాళ్లకింత బలం ఎలా?
Published Sat, Aug 26 2017 4:18 PM | Last Updated on Tue, Sep 12 2017 1:02 AM
Advertisement
Advertisement