
మసూద్ అజహర్ విషయంలో చైనాపై మన వైఖరేంటి?
ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితాలో మసూద్ అజహర్ పేరును చేర్చకుండా చైనా రెండోసారి అడ్డుకుందని, ఈ విషయాన్ని భారతదేశం ఎలా చూస్తోందని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజ్యసభలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆయనీ ప్రశ్న అడిగారు. అసలు చైనా ఏ సాంకేతిక కారణాలతో అడ్డుకుంటోందని, భారత దేశం తన ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమైందా అని కూడా ఆయన అడిగారు. మసూద్ అజహర్ ఈ సమాజానికి ప్రమాదకారి అని స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా చెప్పిన నేపథ్యంలో దీనిపై భారతదేశం ఎలా ముందుకు వెళ్లబోతోందన్నారు.
దానికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2016 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లిందని, మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరిందని చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా గుర్తించారని, అది ఉగ్రవాద కార్యకలాపాలలో ఉండటంతో పాటు అల్ కాయిదాతో కూడా సంబంధాలు కలిగి ఉందని చెప్పామన్నారు. ఆ సంస్థ నాయకుడైన మసూద్ అజహర్‌ను మాత్రం ఉగ్రవాదిగా గుర్తించలేదని, 1267 ఆంక్షల కమిటీలో సభ్యత్వం కలిగిన చైనా ముందుగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా ఆపాలని చెప్పి, ఆ తర్వాత భారత ప్రతిపాదనను 2016 డిసెంబర్ 29న పూర్తిగా అడ్డుకుందని అక్బర్ చెప్పారు. ఈ సంవత్సరం జనవరిలో మళ్లీ తాజాగా అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాలు కమిటీ ముందు మసూద్ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరాయని, అయితే దీనిపై మళ్లీ చైనా అభ్యంతరం చెప్పిందని వివరించారు. కమిటీ నిబంధనల ప్రకారం, ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకోవాల్సి ఉంటుందని, అంతేకాక తమ అభిప్రాయాలకు కారణం ఏంటో ఏ సభ్యదేశం బహిరంగంగా వివరించాల్సిన అవసరం లేదని తెలిపారు. మన ప్రభుత్వం ఈ అంశాన్ని చైనాతో చర్చించిందని కూడా ఆ సమాధానంలో వివరించారు. పాకిస్తాన్ ఇటీవల లష్కరే తాయిబా, జమాత్ ఉద్ దవా సంస్థలను నిషేధించడంతో పాటు హఫీజ్ సయీద్‌ను గృహనిర్బంధంలో ఉంచిందని, అప్పుడే ఆ దేశ రక్షణ మంత్రి హఫీజ్ సయీద్‌ను సమాజానికి ప్రమాదకారిగా చెప్పారని అన్నారు. ఉగ్రవాదాన్ని అణగదొక్కి, మన దేశ పౌరులను కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివరించారు.