పక్షులు అంతరించిపోతే ఏమవుతుంది?
అడవులను విపరీతంగా నరికివేయడం, పొలాల్లో కృత్రిమ ఎరువులు, పురుగు మందులను ఎక్కువగా వాడటం, పట్టణీకరణ, నగరీకరణ పెరిగిపోవడం, గాలి, నీరు కలుషితమైపోవడం, రకరకాల అవసరాల కోసం వేటాడటం వంటి కారణాల వల్ల అనేక జాతులకు చెందిన పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, కొన్ని జాతులకు చెందిన జీవులు మితిమీరి పెరిగిపోకుండా వాటిని ఆహారంగా తీసుకోవడం, మొక్కల్లో ఫలదీకరణకు, బీజవ్యాప్తికి తోడ్పడటం లాంటి పనుల ద్వారా పక్షులు జీవావరణానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. అవే లేకపోతే వాటి ప్రభావం పర్యావరణంపై తీవ్రంగా పడుతుంది.
కొన్నిరకాల మొక్కలు పరాగ సంపర్కం కోసం పక్షులపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. పక్షులు అంతరించిపోతే ఇక ఆ మొక్కల కథ కూడా ముగిసిపోతుంది. అలాగే సముద్రంలోని చేపలను వేటాడి జీవించే కొన్ని పక్షులు.. తమ రెట్టల ద్వారా ఈ భూభాగంలో కొన్నిచోట్ల సారవంతమైన ఎరువును అందిస్తున్నాయి. ఇలా ఏ కోణం నుంచి చూసినా పక్షులు లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టం. వాటిని కాపాడేందుకు, ప్రకృతిలో సమతుల్యతను పరిరక్షించేందుకు మనమందరం శాయశక్తులా కృషిచేయాలి.