బిర్లా... బటర్ చికెన్ చిక్కు!
న్యూఢిల్లీ: రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగా ఉండాలని సామెత. ఇది వ్యాపారానికీ బాగా వర్తిస్తుంది. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న భారత కంపెనీలు ఆయా దేశాల పరిస్థితులకు తగ్గట్లుగా మారక తప్పడం లేదు. 36 దేశాల్లో 4,000 కోట్ల డాలర్ల బిర్లా గ్రూప్‌ను నడిపిస్తున్న కుమార మంగళం బిర్లా ఉదంతమే దీనికి నిదర్శనం. ఆయన మార్వాడీ కమ్యూనిటీకి చెందినవారు.
మార్వాడీల జీవితాల్లో శాకాహారం ప్రధానమైన అంశం. అందుకే ఈ కంపెనీ క్యాంటీన్‌లలో, కంపెనీ కార్యక్రమాల్లో ఎక్కడా మాంసాహారం, వైన్, విస్కీల సరఫరా ఉండదు. ఇదంతా అంతర్జాతీయ విస్తరణకు ముందు మాత్రమే. ఈ గ్రూప్ 2003లో ఆస్ట్రేలియా లో చిన్న రాగి గనుల కంపెనీని కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియా కార్మికుల రోజువారీ జీవితాల్లో ఫోస్టర్ బీర్, బటర్ చికెన్ తప్పనిసరి. దీంతో ఆక్కడి బిర్లా క్యాంటీన్‌లలో ఈ రెండింటినీ సరఫరా చేయక తప్పలేదని బిర్లా పేర్కొన్నారు. రీ ఇమాజినింగ్ ఇండియా, అన్‌లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏషియాస్ నెక్స్‌ట్ సూపర్ పవర్ అన్న పుస్తకంలో రాసిన వ్యాసంలో ఆయన ఈ ఉదంతం వెల్లడించారు.