ఎర్రుపాలెం(ఖమ్మం జిల్లా): గ్రామ జ్యోతి పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లోని ఏ పద్దు నుంచి నిధులు కేటాయిస్తారో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కేశిరెడ్డిపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఫ్లెక్సీల ప్రచారం కోసమే తప్ప ప్రజలకు గ్రామజ్యోతితో ఒరిగేదేమీ లేదన్నారు. గ్రామజ్యోతికి ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి స్పందన లేదన్నారు. ఆశించినస్థాయిలో వర్షాలు కురవక కరువు పరిస్థితులు కనిపిస్తుంటే ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదన్నారు.
గతంలో ఇదే పరిస్థితి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేలు నిర్వహించి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. కనీసం ఉపాధిహామీ పథకం ద్వారా కూడా రాష్ట్రంలో వంద రోజుల పని కల్పించడం లేదన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోని జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలను ఫిరాయించి తమ పార్టీలోకి రావాలని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వేరే పార్టీల తరఫున గెలిచిన ఎంపీటీసీలను సభా వేదికలపైనే ఆహ్వానించడం సిగ్గుచేటని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, పక్కా గృహాలు మంజూరు తదితర ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయలేని పేదల వ్యతిరేక ప్రభుత్వంగా కేసీఆర్ సర్కారు పేరుతెచ్చుకుందన్నారు.
‘గ్రామజ్యోతి’కి ఏ పద్దు నుంచి నిధులిస్తారు?
Published Wed, Aug 19 2015 8:20 PM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM
Advertisement
Advertisement