grama jyothi scheme
-
పల్లెల ప్రగతికే గ్రామజ్యోతి: మంత్రి జూపల్లి
హైదరాబాద్ : పల్లె సీమలు స్వయం అభివృద్ధి సాధించాలనన్న ఉద్దేశ్యంతోనే గ్రామజ్యోతి పథకాన్ని ఏర్పాటు చేశామని తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం ఉదయం శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 2015-16, 2016-17లో రూ. 875 కోట్లు గ్రామజ్యోతి పథకం కింద గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బీటీ రహదార్లు వేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4800 కోట్లతో రహదారులు నిర్మించామని తెలిపారు. 8,222 గ్రామాలకు బీటీ రోడ్లు వేశామన్నారు. మిగిలిన 3027 గ్రామాలకు రహదార్లు వేస్తామని ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. -
‘గ్రామజ్యోతి’కి ఏ పద్దు నుంచి నిధులిస్తారు?
ఎర్రుపాలెం(ఖమ్మం జిల్లా): గ్రామ జ్యోతి పథకానికి రాష్ట్ర బడ్జెట్లోని ఏ పద్దు నుంచి నిధులు కేటాయిస్తారో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కేశిరెడ్డిపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఫ్లెక్సీల ప్రచారం కోసమే తప్ప ప్రజలకు గ్రామజ్యోతితో ఒరిగేదేమీ లేదన్నారు. గ్రామజ్యోతికి ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి స్పందన లేదన్నారు. ఆశించినస్థాయిలో వర్షాలు కురవక కరువు పరిస్థితులు కనిపిస్తుంటే ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదన్నారు. గతంలో ఇదే పరిస్థితి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేలు నిర్వహించి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. కనీసం ఉపాధిహామీ పథకం ద్వారా కూడా రాష్ట్రంలో వంద రోజుల పని కల్పించడం లేదన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోని జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలను ఫిరాయించి తమ పార్టీలోకి రావాలని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వేరే పార్టీల తరఫున గెలిచిన ఎంపీటీసీలను సభా వేదికలపైనే ఆహ్వానించడం సిగ్గుచేటని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, పక్కా గృహాలు మంజూరు తదితర ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయలేని పేదల వ్యతిరేక ప్రభుత్వంగా కేసీఆర్ సర్కారు పేరుతెచ్చుకుందన్నారు. -
'విధులేకాదు..నిధులు కూడా ఇస్తేనే'
హైదరాబాద్: పంచాయతీలకు విధులతో పాటు నిధులు కూడా ఇస్తేనే గ్రామజ్యోతి పథకం విజయవంతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. గ్రామజ్యోతి పథకం ప్రచార ఆర్భటంగానే కనిపిస్తోందన్నారు. గ్రామ పాలనా సిబ్బంది భర్తీ, పంచాయతీల ఆర్థిక నిర్వహణ భారాన్ని ప్రభుత్వమే చేపట్టాలన్నారు. పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.