
ట్రంప్-పుతిన్ రహస్య భేటీ నిజమే
వాషింగ్టన్: హంబర్గ్‌లో జీ-20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రహస్యంగా భేటీ అయిన సంగతి నిజమేనని తాజాగా వైట్‌హౌస్ ధ్రువీకరించింది. ఈ నెల 7న జర్మనీలో హంబర్గ్‌లో జీ-20 సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సు సందర్భంగా ట్రంప్-పుతిన్ అధికారికంగా భేటీ రెండుగంటలపాటు చర్చించారు. ఈ భేటీలో అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు కూడా పాల్గొన్నారు. అనంతరం విందులో ట్రంప్-పుతిన్ గుప్తంగా భేటీ అయ్యారు. విందులో ట్రంప్-పుతిన్ ఎదురెదురుగా కూర్చొగా.. ట్రంప్ లేచి వెళ్లి పుతిన్ పక్కన కూచున్నారు. దాదాపు గంటపాటు వీరి మంతనాలు సాగాయి.
ఈ విషయాన్ని అమెరికాకు చెందిన యూరేషియా గ్రూప్ అధ్యక్షుడు ఇయాన్ బ్రెమ్మర్ మొదట వెల్లడించారు. ఈ రహస్య భేటీని వైట్‌హౌస్ మొదట తోసిపుచ్చినా.. అనంతరం ధ్రువీకరించింది. జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన భేటీలో ట్రంప్-పుతిన్ ముఖాముఖి మాట్లాడారని, ఈ విందులో అధికారిక సిబ్బంది కానీ, మంత్రులు కానీ పాల్గొనలేదని జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి మైఖేల్ అంటన్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ట్రంప్‌కు అనుకూలంగా ప్రభావితం చేసేందుకు పుతిన్ ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు నష్టం కలిగించే సమాచారం అందించాల్సిందిగా ట్రంప్ కొడుకు రష్యా లాయర్‌ను కలిసినట్టు ఇటీవల వెలుగుచూడటం అమెరికాలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికీ చెప్పకుండా ట్రంప్-పుతిన్ రెండోభేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.