
టీ నోట్‌ను ఎందుకు చించరు: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: నేరచరిత నేతలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను చించేసినపుడు తెలంగాణ నోట్‌ను ఎందుకు చించేయరని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నోట్‌ను కేంద్ర మంత్రివర్గంలో ప్రవేశ పెట్టడం అంటే యావత్ సీమాంధ్ర ప్రజలను తీవ్రంగా అవమానించడమేనని, ఆ ప్రాంతంలో జరుగబోయే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
ఆమె గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 65 రోజులుగా సీమాంధ్ర ఉద్యమంతో అట్టుడుకుతోంటే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ నోట్‌పై చర్చ జరుగుతున్నా ఆపడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంకా డ్రామాలాడుతున్నారని ఆమె విమర్శించారు. తన లేఖను వెనక్కి తీసుకోకుండా చంద్రబాబు రాష్ట్రానికే కాదు, యావత్ తెలుగు ప్రజలందరికీ ద్రోహం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.