ఉల్లి ధర ఆల్టైం రికార్డ్!
రిటైల్ ధర రూ.60, హోల్‌సేల్‌లో రూ.48
సాక్షి, హైదరాబాద్: ఉల్లిగడ్డ ధర ఆకాశాన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌లో రూ. 60 కు ఎగబాకింది. గతంతో పోలిస్తే దీనిని ఆల్ టైం రికార్డుగా పేర్కోవచ్చు. ఉల్లి ధర నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలించడం లేదు. డిమాండ్‌కు తగినట్లుగా ఉల్లి సరఫరా లేకపోవటమే ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. శుక్రవారం నగరానికి 9,794 క్వింటాళ్ల ఉల్లిగడ్డ దిగుమతయ్యింది. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, కర్నూలు ప్రాంతాల నుంచి నగరానికి ప్రతిరోజూ 15 వేల నుంచి 16 వేల క్వింటాళ్ల వరకు ఉల్లి సరఫరా జరిగేది.
అయితే ఆయా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో సరఫరా తగ్గిపోయింది. శుక్రవారం ఒక్క రోజే 7 వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతి నిలిచి పోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా దిగుమతైన 9,794 క్వింటాళ్ల సరుకులో గ్రేడ్ వన్ రకం 1,959 క్వింటాళ్లు కాగా, గ్రేడ్ టు రకం 7,835 క్వింటాళ్లు ఉంది. గ్రేడ్ వన్ ఉల్లి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.5,800లు, కనిష్ఠ ధర రూ.4,500 పలుకగా, మోడల్ ధర రూ. 5,200 పలికింది. గ్రేడ్ టు ఉల్లి క్వింటాల్ ధర గరిష్ఠంగా 4,800, కనిష్ఠ ధర రూ. 3,000, మోడల్ ధర రూ. 4,500 పలికింది. రిటైల్ మార్కెట్‌లో కిలో ధర రూ. 60 లకు విక్రయిస్తుండగా, హోల్‌సేల్‌గా రూ.48 చొప్పున విక్రయిస్తున్నారు.