ఇఫ్తార్ విందులు సూడో సెక్యులరిజమ్ కాదా? | With the RSS hosting iftar parties, is pseudo-secularism now a good thing? | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్ విందులు సూడో సెక్యులరిజమ్ కాదా?

Published Fri, Jul 1 2016 6:50 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఇఫ్తార్ విందులు సూడో సెక్యులరిజమ్ కాదా? - Sakshi

ఇఫ్తార్ విందులు సూడో సెక్యులరిజమ్ కాదా?

న్యూఢిల్లీ: ‘సూడో సెక్యులరిజమ్’ అనే  పదాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ 1980వ దశకంలో కాయిన్ చేశారు. మైనారిటీల పట్ల లేని ప్రేమను ఒలకబోస్తున్నారంటూ కాంగ్రెస్, వామపక్ష పార్టీలను విమర్శించడం కోసమే ఆయన ఈ పదాన్ని సృష్టించారు. అయితే ఏదో ఒక రోజును తాను రాజకీయంగా పుట్టి పెరిగిన రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సూడో సెక్యులరిస్ట్‌గా మారుతుందని ఆయన ఏనాడు ఊహించి ఉండరు. రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడాన్ని కూడా సూడో సెక్యులరిజమయేనని ఆరెస్సెస్ స్వయంగా ఎన్నోసార్లు విమర్శించింది.

అలాంటి ఆరెస్సెస్ ఇప్పుడు, అంటే జూలై రెండో తేదీన ముస్లిం దేశాల అంబాసిడర్లకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఆరెస్సెస్‌లో అంతర్భాగంగా పనిచేస్తున్న రాష్ట్రీయ ముస్లిం మంచ్ ఈ కార్యక్రమానికి ఘనమైన ఏర్పాట్లు చేసింది. పొరుగునున్న ముస్లిం దేశమైన పాకిస్తాన్ అంబాసిడర్‌ను కూడా ఈ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడంపై స్వీయ పక్షంలోనే గొడవలు బయల్దేరాయి. కాశ్మీర్‌లో జూన్ 25వ తేదీన ఎనిమిది మంది భారత పారా మిలటరీ సైనికులు మిలిటెంట్ల కాల్పుల్లో మరణించిన సంఘటన నేపథ్యంలో ఈ అంశం వివాదాస్పదం అవడంతో చివరి నిమిషంలో పాకిస్తాన్ అంబాసిడర్‌కు ఆహ్వానం పంపించడాన్ని రద్దు చేసుకుంది.

రాజకీయాల పార్టీలు ముస్లిం ఓట్లను ఆకర్షించడంలో భాగంగా ముస్లింలకు ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేయడాన్ని ఇంతకాలం వ్యతిరేకంచిన ఆరెస్సెస్ ఇప్పుడు ఎందుకు తన వైఖరి మార్చుకోవాల్సి వచ్చిందో అర్థం కాదు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రభుత్వం హిందూ మత కార్యక్రమాలను, సంప్రదాయాలను, చట్టాలను ప్రోత్సహిస్తున్న విషయం తెల్సిందే. వివిధ రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలు కూడా హిందూ పరివారం ఒత్తిళ్ల వల్లనే వచ్చాయనే విషయం అవగమే. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ లాంటి హిందు సంస్థల పట్ల లెక్యులరిస్టుల వ్యతిరేకత కూడా బాగా పెరిగింది. తమకు ముస్లింల పట్ల అలాంటి వ్యతిరేకత లేదనే విషయాన్ని చెప్పాలనుకునే ఆరెస్సెస్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిందా? అలాంటప్పుడు అది సూడో సెక్యులరిజమ్ కాదా?

భారత రాజకీయాల్లో ఇఫ్తార్ విందులు రాజకీయ ఎత్తుగడగా ఎప్పుడో మారిపోయిన విషయం తెల్సిందే. ఒకప్పుడు ఇలాంటి మత కార్యక్రమాలకు ప్రభుత్వాలు దూరంగా ఉండేవి. ఇప్పుడు పార్టీలు అనుసరిస్తున్న వైఖరినే ప్రభుత్వాలు కూడా ఆచరించడం సెక్యులరిజమ్ భావానికి తూట్లు పొడవడమే. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేయడం, ఆ సందర్భంగా ముస్లిం సంప్రదాయ దుస్తులు ధరించడం ఇందిరాగాంధీ నుంచి వస్తున్న ఆనవాయితే. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే వస్తున్నాయి. ముస్లింలు తాము ఏర్పాటు చేసుకున్న ఇఫ్తార్ విందులకు రాజకీయ నాయకులను పిలవడాన్ని, రాజకీయ పార్టీలే ఇఫ్తార్ విందులను ఏర్పాటుచేసి ముస్లింలను ఆహ్వానించడాన్ని ఇక్కడ వేరుగా చూడాలి. ముస్లింలు ఏర్పాటు చేసుకున్న ఇఫ్తార్ విందుకు వెళ్లడమంటే వారి ఆహ్వానాన్ని మన్నించి వెళ్లడం, వారి విశ్వాసాలను గౌరవించడం అవుతుంది. ఓ రాజకీయ పార్టీయే వారి కోసం ఇలాంటి విందులు ఏర్పాటు చేయడం కచ్చితంగా రాజకీయ ఎత్తుగడే అవుతుంది.

 భారత్ రాజ్యాంగంలోని సెక్యులర్ భావం ప్రకారం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏవీ కూడా అధికారికంగా ఎలాంటి మత కార్యక్రమాలను ప్రోత్సహించరాదు. ఎలాంటి మత కార్యక్రమానికి ఐదు పైసలు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టరాదు. ఇఫ్తార్ విందుల విషయానికి వస్తే మొన్ననే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వం ఖర్చుతో ముస్లిం సోదరుల కోసం ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది.

ఇక, ఇతర మత కార్యక్రమాల గురించి ప్రస్తావించాలంటే కోకొల్లలు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో పదివీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే వారణాసికి వెళ్లి అధికార హోదాలో పూజాది కార్యక్రమాలు చేశారు. ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు గురుద్వారాలను, ఛిస్తీలను, దర్గాలను. హిందూ దేవాలయాలను సందర్శించడం ప్రభుత్వం ఖర్చుతో చద్దర్‌లను, పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించడం తెల్సిందే. ఇదంతా సూడో సెక్యులరిజమ్ కాదా?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement