ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. ట్రెయిన్, ప్లాట్‌ఫామ్ మధ్య చిక్కుకుని ఓ మహిళ దుర్మరణం పాలైంది. కాన్పూర్ రైల్వేస్టేషన్లో గత రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ పట్టు తప్పి కిందపడిపోయింది. దాంతో ఆమె రైలుకు ప్లాట్‌ఫామ్‌కి మధ్యన ఉన్న సందులో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన మహిళను బయటకు తీసేందుకు రైల్వే సిబ్బంది సుమారు 45 నిమిషాలు పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ప్లాట్‌ఫామ్‌ను పగలగొట్టి మృతదేహాన్ని అధికారులు బయటకు తీశారు.
కాగా రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె మృతి చెందిందని మృతురాలి తల్లి ఆరోపించింది. తన కుమార్తె రైలు ఎక్కుతున్న సమయంలో విద్యార్థులు తోయటంతో పట్టు తప్పిపడిపోయిందని తల్లి తెలిపింది. అయితే రైల్వే అధికారులు ఈ ఘటనపై మాట్లాడుతూ తమ తప్పిందమని ఆరోపించటం తగదని, మహిళ కదులుతున్న రైలు ఎక్కుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రయాణికురాలి అప్రమత్తంగా లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినందున ఆ కుటుంబానికి ఎలాంటి పరిహారం చెల్లించలేమని నార్త్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో నవీన్ బారు స్పష్టం చేశారు.