
సెట్‌టాప్ బాక్స్ అప్‌డేట్ చేయాలని వచ్చి...
డీటీహెచ్ కంపెనీకి చెందిన ఉద్యోగి.. మీ ఇంట్లో సెట్‌టాప్ బాక్సును అప్‌డేట్ చేయాలంటూ వచ్చి మహిళపై అత్యాచారం చేశాడు. అతడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. మునిరెడ్డి అనే వ్యక్తి ఓ డీటీహెచ్ సంస్థలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. గత వారం ఓ ఇంట్లో సెట్ టాప్ బాక్సు రిపేరు వచ్చిందని కంప్లయింట్ రావడంతో.. అక్కడకు వెళ్లినప్పుడు ఇంట్లో మహిళ ఒక్కరే ఉంటున్నట్లు గుర్తించాడు.
దాంతో మరోసారి ఆ ఇంటికి వెళ్లి, సెట్ టాప్ బాక్సును అప్‌డేట్ చేయడానికి వచ్చానని చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని నిర్ధారించుకుని, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు అరవడంతో మునిరెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పగా, వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో బెంగళూరుకు సమీపంలో ఉన్న ఓ గ్రామంలో ఉన్న మునిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.