న్యూఢిల్లీ: 'కర్వా చౌత్' సందర్భంగా ఉపవాసం ఎందుకు ఉండలేదని భర్త ప్రశ్నించినందుకు భార్య ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పశ్చిమ ఢిల్లీలోని కల్యాణి పురి ప్రాంతంలో మంగళవారం సంభవించింది. ఆత్మహత్యకు యత్నించిన మహేష్ కుమారిలకు 1991 వ సంవత్సరంలో విజయ్ అనే వ్యక్తితో వివాహమైంది. ఈ క్రమంలో వీరికి నలుగురు సంతానం కూడా కలిగారు.
ఇదిలా ఉండగా భర్తల బాగోగుల కోరుతూ మహిళలు 'కర్వా చౌత్' చేయడం అనవాయితీ. ఉపవాసం ఉండాలనే విషయాన్ని భార్య కుమారి మనించకపోవడంతో భర్త నిలదీశాడు. దీనిపై మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య వాగ్వివాదం కూడా జరిగింది. భర్త తనను నిలదీయడంతో కలత చెందిన ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ప్రస్తుతం ఆమెకు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, భర్త ఉపవాసం ఉండాలని బలవంతం చేసిన కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.