
ప్రవాస పెళ్లికొడుకులూ... వింటున్నారా?
పొరుగు దేశాలకు వెళ్లగానే స్వదేశ సాంప్రదాయాలు, సంస్కృతులను తూలనాడడం కొంతమందికి అలవాటుగా మారింది. అలాంటి వారు ఇకనుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా పెళ్లికాని యువకులు. స్వదేశీ సాంప్రదాయాలు, విలువలు గౌరవించని వాని కళ్యాణ్ యోగం దూరమయ్యే ముప్పు పొంచివుంది. విలువలకు, వివాహానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా. సాంప్రదాయాల పట్ల అమర్యాద ప్రవర్తించే యువకులను పెళ్లాడేందుకు భారత యువతులు ఇష్టపడడం లేదు(ట).
భారతదేశ విలువలు పాటించని ఎన్నారై యువకులను పెళ్లాండేందుకు పుణ్యధరిత్రి పడతులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. పరాయి దేశంలో పైసలు దండిగా సంపాదిస్తున్నా- సొంత సంస్కృతి, సంప్రదాయాలను పట్టించుకోకుంటే అలాంటివారికి వరమాల వేయబోమని కరాకండీగా చెప్పారో సర్వేలో. షాదీ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో యువతులు ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు.
మన సాంప్రదాయాలను గౌరవించని వారిని వివాహం చేసుకోబోమని 51.7 శాతం మంది యువతులు సర్వేలో పేర్కొన్నారు. సొంతగడ్డను చిన్నచూపు చూసేవారిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని 33.5 శాతం మంది కుండబద్దలుకొట్టారు. తెచ్చిపెట్టుకున్న యాసతో వంకర్లు పోయే వారిని వివాహం చేసుకోబోమని 66.7 శాతం మంది స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పెళ్లికాని 5,200 మంది యువతులను ఆన్లైన్ లో సర్వే చేశారు. నిష్కళంక భాగస్వాములనే యువతులు ఇష్టపడుతున్నారని సర్వేలో స్పష్టమైంది. ప్రవాస పెళ్లికొడుకులూ... వింటున్నారా?