- ఏపీ స్పీకర్ కోడెలతో ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధి భేటీ
సాక్షి,హైదరాబాద్: మహిళా పార్లమెంటేరియన్ తొలి మహాసభలు సెప్టెంబర్ మూడో వారంలో విజయవాడలో జరగనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా మహిళా శాసనసభ్యులు పాల్గొంటారు. ఈ సమావేశాలను పుణే లోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసాద్ ఫౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్‌ల సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్వహించనుంది.
సమావేశాలకు చైర్మన్‌గా స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చీఫ్ ప్యాట్రన్‌గా సీఎం చంద్రబాబు, అధ్యక్షురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుధా నారాయణమూర్తి వ్యవహరిస్తారు. సమావేశాల నిర్వాహణ పై ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధి రాహుల్ విశ్వనాథన్ కరాడ్ మంగళవారం ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావుతో సమావేశమై చర్చించారు. ‘మహిళా ప్రోత్సాహం - ప్రజాస్వామ్యం పటిష్టత’ అనే అంశంపై మూడు రోజుల పాటు జరిగే మహాసభ తొలి రోజు ‘మహిళా సాధికారిత- రాజకీయ సవాళ్లు’, వ్యక్తిత్వ నిర్మాణం - భవిష్యత్తు దార్శనికత, గురు శిష్యుల సంబంధాల పెంపు అన్న అంశాలపైన, రెండవ రోజు మహిళల స్థితి - నిర్ణయాత్మకశక్తి, మీకు మీరే సాటి అనే అంశాలపైన ప్రముఖుల ప్రసంగాలుంటాయి. మూడవ రోజు మహి ళా సాధికారిత కోసం పరుగు నిర్వహించనున్నారు.