
రోజా లేఖను పరిగణనలోకి తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన నగరి శాసన సభ్యురాలు ఆర్.కె.రోజా ఇచ్చిన లేఖను పరిగణనలోకి తీసుకుని ఆమె సస్పెన్షన్ వ్యవహారాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతికి సూచించింది. సంబంధిత పిటిషన్ గురువారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితావరాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు వచ్చింది. ఈనేపథ్యంలో పిటిషనర్ రోజా తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ... ‘రోజాపై విధించిన సస్పెన్షన్‌కు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 22, 2016న స్పీకర్‌కు రాసిన లేఖను ఈ న్యాయస్థానం ముందుంచాం.
2015 డిసెంబర్ 18వ తేదీన అసెంబ్లీలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరణను ఆ లేఖలో పొందుపరిచాం. మీ ఆదేశాల మేరకు స్పీకర్‌కు అందజేశాం. అయితే ఆ లేఖను పరిగణనలోకి తీసుకుని సభాపతి ఆ అంశాన్ని పరిష్కరించలేదు..’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే ఆ లేఖ సభాపతికి అందలేదని ప్రతివాది తరపు న్యాయవాది ప్రేరణాసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ నేపథ్యంలో ధర్మాసనం జోక్యం చేసుకుని సదరు లేఖను ఇప్పుడే ప్రతివాది తరపు న్యాయవాదికి ఇవ్వాలని సూచించగా లేఖ ప్రతిని ఇందిరా జైసింగ్ అందజేశారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ... ఎమ్మెల్యేపై సస్పెన్షన్ కాల వ్యవధి కూడా అయిపోయిందన్న విషయాన్ని ప్రస్తావించింది. సభాపతి ఈ లేఖను పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్ అంశాన్ని పరిష్కరించాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.