ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటి నుంచి 'సమాజ్‌వాదీ' అనే పదాన్ని తీసేశారు. దానికి బదులు 'ముఖ్యమంత్రి' అనే పదాన్ని చేర్చారు. ఈ విషయాన్ని కేబినెట్ మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్ విలేకరులకు తెలిపారు. గురువారం అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలేష్ ప్రభుత్వం ఇంతకుముందు సమాజ్‌వాదీ పెన్షన్ యోజన, సమాజ్‌వాదీ అంబులెన్స్ సేవ, సమాజ్‌వాదీ స్మార్ట్‌ఫోన్ యోజన లాంటి పథకాలు ప్రవేశపెట్టింది. వీటన్నింటి పేర్లలో ఉన్న పార్టీ పేరు తీసేసి వాటికి బదులు 'ముఖ్యమంత్రి' అని పెట్టనున్నారు. దాంతో ఏ పార్టీ ముఖ్యమంత్రి వచ్చినా ఆ పథకాలను కొనసాగించేందుకు వీలుంటుంది. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ముద్రించిన 60 లక్షల రేషన్ కార్డులను ప్రజలకు పంపణీ చేయకూడదని కూడా ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. వాటన్నింటి మీద అఖిలేష్ ఫొటోను అప్పట్లో ముద్రించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ కార్డులను సిద్ధం చేశారు. దాంతో వాటన్నింటినీ రద్దుచేసి, కొత్త కార్డులు ఇవ్వాలని యోగి నిర్ణయించారు.
జిల్లా కేంద్రాలన్నింటిలో రోజుకు 24 గంటలూ నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మిగిలిన గ్రామాలు, తహసీళ్లలో కనీసం 18 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. ఈ విషయమై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ త్వరలో సమావేశం కానున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న జెవార్ విమానాశ్రయ ప్రాజెక్టుకు కూడా యూపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడో మాయావతి ప్రభుత్వ హయాంలోనే దీన్ని ప్రవేశపెట్టినా, అఖిలేష్ ప్రభుత్వం జెవార్ కంటే ఆగ్రాలో పూర్తిస్థాయి విమానాశ్రయాన్ని ఏర్పాటుచేయాలని అఖిలేష్ సర్కారు భావించి దీన్ని పక్కన పెట్టింది. యూపీలో కూడా గుజరాత్ తరహా అభివృద్ధిని తీసుకురావాలని యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలు, ఇతర విధానాలతో కూడిన ఒక యాప్ తేవాలని కూడా అనుకుంటున్నారు. బుందేల్‌ఖండ్ సంబంధిత అంశాలపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.
'సమాజ్‌వాదీ' పదాన్ని తీసేసిన సీఎం యోగి
Published Fri, Apr 7 2017 11:46 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
Advertisement
Advertisement