యువతి ఆత్మహత్యపై అనుమానాలు
బరంపురం: యువతి మమ్మిని బెహరా(20) మరణంపై పోలీసు అధికారుల్లో హత్య, ఆత్మహత్య అనే సందేహాలు ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం బెహరా మృతి చెందగా, దీనిపై అనుమానాలు వీడడం లేదు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం... బరంపురం పెద్ద బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో కుమ్మరి వీధిలో బాస్కర్ బెహరా నివాసం ఉంటున్నాడు. తమ్ముడు కుమార్తె మమ్మిని బెహరా(20) తన ఇంట్లో ఉంటూ మహమాయి మహిళా కళాశాలలో +3 డిగ్రీ చదువుతుంది.
ఈ నెల 12వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో మమ్మిని బెహరా నిద్రలేచి పెరటిలోకి వెళ్లి తన చున్నీతో ఉరి వేసుకుంది. మమ్మిని బెహరా ఎంతకీ రాకపోయే సరికి పెద్దమ్మ రంజని బెహరా పెరటికి వెళ్లి చూసే సరికి కొన ఊపిరితో మమ్మిని ఉంది. వెంటనే ఆటోలో సోదరుడు సునిల్ బెహరా, పెద్దనాన్న భాస్కర్ బెహరా సొంత గ్రామం కుల్లడా తీసుకువెళుతుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు సోదరుడు సునిల్ బెహరా తెలియజేశారు. మృతురాలు తండ్రి సంతోష్ బెహరా, పెద్దనాన్న భాస్కర్ బెహరా కలిసి శ్రీరామ్‌నగర్ చివరన ఉన్న శ్మశానంలో మమ్మిని బెహరాకు దహన సంస్కారాలు చేశారు.
మమ్మిని బెహరా ఆత్మహత్యపై అనుమానాలు రావడంతో ఆమె సొంత సోదరులు దీరు బెహరా, గురు బెహరా ఆదివారం సాయంత్రం పెద్ద బజార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేవారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దర్యాప్తు కొనసాగుతుందని పూర్తయిన వెంటనే నిజాలు వెలుగులోకి వస్తాయని ఎస్‌డీపీవో తెలియజేశారు.