‘ప్రేమ వల’ నుంచి యువతికి విముక్తి
న్యూఢిల్లీ: కర్ణాటక, ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో నయవంచకుడి వలలోనుంచి ఓ యువతి క్షేమంగా బయటపడింది. మోసానికి పాల్పడిన యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే... ఆరేడు నెలల క్రితం కర్ణాటకలోని బాగల్‌కోట్‌కు చెందిన యువతికి ఓ మిస్‌డ్ కాల్ వచ్చింది. దీంతో ఆమె తిరిగి ఫోన్ చేసింది. పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాకు చెందిన సుజోయ్‌దేయ్ ఫోన్ ఎత్తి తాను వ్యాపారవేత్తగా చెప్పుకుంటూ పరిచయం చేసుకున్నారు.
ఆ తర్వాత పరిచయాన్ని కొనసాగిస్తూ నెమ్మదిగా సదరు యువతికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు. కొన్నిరోజులపాటు ఈ వ్యవహారం నడిచిన తర్వాత ఓ రోజు తనకు పెళ్లి చేయాలనుకుంటున్నారని, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారని యువతి చెప్పడంతో ఇంట్లోనుంచి పారిపోయి రావాలంటూ సుజోయ్ చెప్పాడు. దీంతో సుజోయ్ చెప్పినట్లుగానే ఆమె రూ.3 లక్షల నగదు, పది తులాల బంగారంతో ఇంట్లోనుంచి పారిపోయి బెంగళూరుకు వచ్చింది.
సుజోయ్ కూడా బెంగళూరుకు చేరుకొని ఇద్దరు అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చారు. అక్కడ ఓ గెస్ట్‌హౌస్‌లో ఆమెతో రాత్రంతా గడిపిన సుజోయ్ మరుసటి రోజే యువతి తండ్రికి ఫోన్ చేశాడు. రూ. 10 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఫోన్ నంబర్ ఆధారంగా కర్ణాటక, ఢిల్లీ పోలీసులు దర్యాప్తు నిర్వహించి ఎట్టకేలకు యువతిని కాపాడారు. కాగా సుజోయ్ 12వ తరగతి వరకు చదువుకొని, ఓ టీ షర్టులు తయారయ్యే కంపెనీలో పనిచేస్తున్నాడని, బాధితురాలు సెకండ్ ఇయర్ చదువుతోందని పోలీసులు తెలిపారు.