మోదీ ఫొటో మార్ఫింగ్.. యువకుడి అరెస్టు
ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను మార్ఫింగ్ చేసి, తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్న ఓ యువకుడిని కర్ణాటకలోని గంగావతి పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ మహబూబ్ (25) అనే ఈ యువకుడు.. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కాళ్ల మీద ప్రధాని నరేంద్రమోదీ పడుతున్నట్లు ఉన్న ఫొటోను తయారుచేసి, దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఐపీ నెంబరు ఆధారంగా, గంగావతిలోని ఓ నగల దుకాణంలో పనిచేసే మహ్మద్ ఈ పనికి పాల్పడినట్లు తెలుసుకున్న పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు. అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని, విచారిస్తున్నారు. అతడే ఈ ఫొటోను తయారుచేశాడా, లేక తన ఫేస్‌బుక్ ఖాతాకు వేరే ఎవరైనా షేర్ చేశారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.