
రేపిస్టులను ఎదిరించి.. బయటపడింది
ఒకటికి రెండుసార్లు రేపిస్టులను ఎదిరించి.. ధైర్యంగా నిలబడిన యువతి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచింది. దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో 24 ఏళ్ల భూటాన్ యువతి సోనమ్ అర్ధరాత్రి తనకు బాగా తెలిసిన దుండగుల బారి నుంచి తనను తాను రక్షించుకుంది. భూటాన్‌కు చెందిన సోనమ్ ఆరు నెలల క్రితం బెంగళూరుకు వచ్చి, హెబ్బగొడి ప్రాంతంలో బ్యుటీషియన్‌గా పనిచేస్తోంది. ఆదివారం రాత్రి ఆమె ఒక బర్త్‌డే పార్టీకి వెళ్లింది. అక్కడ ఒక నిందితుడు ఆమెను సిగరెట్ కాల్చమన్నారు. సరేనని కాలుస్తూ ఆమె ఫ్లాట్‌లోకి వెళ్లింది. అక్కడ మరో ఇద్దరు ఉన్నారు. లోపలకు వెళ్లాక అక్కడ ఒక స్నాక్స్ పార్లర్‌లో పనిచేస్తున్న నిందితులు ముక్తియార్, ఖదీమ్, బాబు అనే ముగ్గురూ ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. వీళ్లు ముగ్గురూ అసోంకు చెందినవారు. ఆ తర్వాత ఆమెపై లైంగిక వేధింపులు మొదలుపెట్టారు. అయితే, ఆ ఫ్లాట్‌లోకి వెళ్లడానికి ముందే ఆమె తన బోయ్‌ఫ్రెండుకు ఫోన్ చేసింది. దాంతో అనుమానం వచ్చిన అతడు.. పదే పదే ఆమెకు ఫోన్ చేస్తున్నా, ఆమె ఆన్సర్ చేయలేదు.
నిందితులు ముగ్గురూ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఆమె వాళ్లను ఎదిరించి, ఫ్లాట్ నుంచి బయటకు పరుగెత్తింది. ఒక వ్యక్తిని సాయం కోరగా, ఆమె భాష అతడికి అర్థం కాలేదు. వెనక వస్తున్నవాళ్లు ఆమె స్నేహితులనుకుని, వాళ్లకే అప్పగించేశాడు. దాంతో నిందితులు ఆమెను మళ్లీ ఫ్లాట్‌లోకి లాక్కెళ్లారు. రెండోసారి కూడా ఆమె వారి నుంచి తప్పించుకుని.. ఈసారి ఓ జంట వద్దకు వెళ్లింది. వాళ్లు వెంటనే పోలీసులను పిలిచారు. దాంతో నిందితులు ఫ్లాట్‌లోకి వెళ్లిపోయారు. కానీ పోలీసులు వాల్లను చూసి వెంటనే పట్టుకుని అరెస్టు చేశారు. నిందితులతో పాటు బాధితురాలికి కూడా వైద్యపరీక్షలు చేయించారు. తనపై అత్యాచారం జరగలేదు కానీ, వాళ్లు లైంగికంగా వేధించినట్లు భూటాన్ యువతి తెలిపింది. సాంకేతికంగా అత్యాచారం జరగకపోయినా.. నిందితులకు కఠిన శిక్ష పడేందుకు వాళ్లపై అత్యాచారం కేసు పెట్టినట్లు ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీసులు తెలిపారు.