
నేడు విజయవాడకు వైఎస్ జగన్
రేపు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన
కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో పుష్కర స్నానం
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధవారాల్లో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం సోమవారం పర్యటన వివరాలు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న వైఎస్ జగన్ మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.
1 గంటకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 6 గంటలకు కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొంటారు. బుధవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో జగన్ పుష్కర స్నానం ఆచరిస్తారు. ఆ తరువాత రాజమండ్రి కోటిలింగాల క్షేత్రంలోని మార్కండేయస్వామి దర్శనం చేసుకుంటారని రఘురాం తెలిపారు.