
వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాల అడ్డగింత!
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఆందోళన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం వైజాగ్‌కు వస్తుండటంతో పోలీసులు ఓవరాక్షన్‌కు తెరతీశారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో భారీగా బందోబస్తును మోహరించారు. ఎయిర్‌పోర్టులో డీజీపీ సాంబశివరావు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ రోజు సాయంత్రం వైజాగ్ బీచ్‌రోడ్డులో జరిగే మహా కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్ జగన్ పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. ఆర్కే బీచ్‌లో సాయంత్రం ఆరు గంటలకు ఈ ర్యాలీ మొదలవుతుంది. ఆర్కే బీచ్ నుంచి పార్కు హోటల్ వద్దనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుంది. అయితే, ఈ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ర్యాలీ నిర్వహించే ప్రాంతంలో పోలీసులు అడుగడుగునా మోహరించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వైజాగ్‌లో ప్రత్యేక హోదా ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. శాంతియుత పోరాటానికి సిద్ధమైన యువతను పోలీసులు, ప్రత్యేక బలగాలు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.