క్షీణిస్తున్న ఆరోగ్యం.. సడలని సంకల్పం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాగా నీరసించిపోయారు. సోమవారం ఉదయం ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయనకు షుగర్ లెవల్ తగ్గింది. బీపీ, పల్స్‌రేటు పడిపోయాయి. బరువు కూడా తగ్గారు.
జననేత ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నాయకుడు ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకూ తాను చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
జననేత ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా దీక్షకు దిగిన వైఎస్ జగన్ ను ఈ ఉదయం జర్నలిస్ట్ నాయకులు కలిశారు. ఐజేయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ తదితరులు జగన్ ను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.