వైఎస్ జగన్ దీక్ష సఫలం కావాలి: ఉండవల్లి
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష సఫలం కావాలని కోరుకుంటున్నట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలపై ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విభజన విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. నాటి ప్రతిపక్షం, అధికార పక్షం కలిసి ఏకమై మోసం చేశాయని చెప్పారు.
విభజన సందర్భంలో సభలో జరిగిన అంశాలతో పొందుపరిచిన పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని అన్నారు. తామేం చేసినా అడిగే దిక్కెవరూ లేరన్నట్లుగా విభజన చేశారని అన్నారు. విభజన సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిన మాటను తప్పాయని చెప్పారు. విభజన జరిగి ఏడాదిన్నర అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక హోదాపై వెంకయ్యనాయుడు సినిమా చూపించారని అన్నారు. విభజన అంశాన్ని బీజేపీ ఎన్నికల్లో వాడుకుందని అన్నారు. ఎన్నికలు ముగిశాక మాత్రం ఇచ్చిన హామీ మరిచిపోయిందని చెప్పారు. బిల్లులోని ఏ ఒక్క హామీని బీజేపీ అమలుచేయలేదని అన్నారు. అసలు ఈ విభజన బిల్లు పాసవలేదని అన్నారు. బిల్లును ప్రతిపక్షాలు అన్నీ వ్యతిరేకిస్తున్నా తాము మాత్రం విభజనకు మద్దతు ఇస్తున్నామని నాడు సుష్మా స్వరాజ్ అన్నారని చెప్పారు. వెంకయ్యనాయుడు, కపిల్ సిబాల్ కలిసే బిల్లు సిద్ధం చేశారని ఆమె చెప్పారని కూడా అన్నారు.
విభజన కారణంగా ఇప్పుడు తలెత్తిన పలు సమస్యలకు పార్లమెంటే సమాధానం చెప్పాలని అన్నారు. నాడు విభజనలో లేవనెత్తిన సవరణ అంశాలను పట్టించుకోకుండానే బిల్లు ఆమోదింపజేశారని, ప్రస్తుత సమావేశాల్లో వాటన్నింటిపై తిరిగి చర్చ చేపట్టాలని అన్నారు. ఇక ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేకుంటే కేంద్రం ఆ విషయం స్పష్టం చేయాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష సఫలం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం మనసు మారాలని చెప్పారు.