చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే డెల్టాలో కరువు: వైఎస్ జగన్
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే కృష్ణా డెల్టాలో కరువు ఏర్పడిందని, ఏలూరు కాల్వ పుట్టిననాటి నుంచి ఏనాడూ ఇలాంటి రైతులు ఇంతలా బాధపడలేదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడులో సోమవారం పర్యటించిన వైఎస్ జగన్ ఎండిపోయిన పంటలు పరిశీలించి, స్థానిక మినుము రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
‘చంద్రబాబు సీఎంగా ఉన్న రెండేళ్లలో రైతులకు సాగునీరు అందించలేదు. పంట నష్టపోయిన రైతులను కనీసం అధికారులు కూడా పరామర్శించలేదు. కేవలం అధికార పార్టీకి చెందిన నాయకుల పొలాలను మాత్రమే సర్వేచేసి పరిహారం ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. నీళ్లొస్తాయనే ఆశతో మినుము పంట వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని 3వేల ఎకరాల పరిస్థితి ఇలాగే ఉంది’ అని వైఎస్ జగన్ అన్నారు. ఎండిన పంటపొలాల పక్క నుంచే వెళ్లి విమానం ఎక్కే జిల్లా మంత్రి ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.