మా పోరుకు మద్దతివ్వండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి | Ys Jagan mohan reddy meets Sharad Pawar, Uddhav Thackeray to stop bifurcation | Sakshi
Sakshi News home page

మా పోరుకు మద్దతివ్వండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Published Tue, Nov 26 2013 2:15 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

మా పోరుకు మద్దతివ్వండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - Sakshi

మా పోరుకు మద్దతివ్వండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

 *  ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవాలి: పవార్, ఠాక్రేలకు జగన్ వినతి
 * దేశంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగనిది ఏపీలో జరుగుతోంది
 * అసెంబ్లీ తీర్మానం లేకుండానే రాష్ట్ర విభజనకు కేంద్రం సిద్ధమైంది
 *  దీన్ని అడ్డుకోకపోతే.. రేపు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాగే జరుగుతుంది
 * భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనకు నిర్దిష్ట విధివిధానాలు ఉండాలి
 * ఏ రాష్ట్ర విభజనకైనా అసెంబ్లీలో, పార్లమెంటు ఉభయసభల్లో  మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదం తప్పనిసరి చేయాలి
*  ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్-3కు సవరణలు చేయాలి
*  ప్రజాస్వామ్య పరిరక్షణకు మా పోరాటానికి మద్దతు ఇవ్వాలి
 * ఎన్‌సీపీ, శివసేన అధినేతలతో భేటీల్లో విజ్ఞప్తి చేసిన జగన్

 
 సాక్షి, ముంబై: ‘‘కేంద్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేయటమనే సంప్రదాయానికి నీళ్లొదిలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. దీనిని అడ్డుకోకపోతే రేపు ఏ రాష్ట్రాన్నైనా ఇలాగే విభజించే దుష్ట సంప్రదాయం మొదలవుతుంది. ఏ రాష్ట్ర విభజనకైనా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించటం తప్పనిసరి చేయాలి. ఏకగ్రీవ తీర్మానం కాకుంటే కనీసం మూడింట రెండొంతుల మెజారిటీ అయినా ఆమోదించాలి. శాసనసభతో పాటు పార్లమెంటు ఉభయసభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటేనే రాష్ట్ర విభజన చేపట్టాలి. ఈ దిశగా రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించాలి.
 
 ఇందుకు మీ సహకారం కావాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన మా పోరాటానికి అందరూ మద్దతివ్వాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌కు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేలను వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు, ఏకపక్ష విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరణ కోరుతూ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, బాలశౌరిలతో కలిసి ముంబై చేరుకున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు నారీమన్ పాయింట్‌లోని ైవె .బి.చవాన్ హాల్‌కు వెళ్లి శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట సేపు ఆయనతో చర్చించారు. అక్కడి నుంచి నేరుగా బాంద్రాలోని ఉద్ధవ్‌ఠాక్రే నివాసం మాతోశ్రీకి వెళ్లి శివసేన అధినేతతో జగన్ సమావేశమయ్యారు. సాయంత్రం 4:15 గంటల నుంచి దాదాపు 45 నిమిషాల పాటు ఠాక్రేతో చర్చించారు.
 
 ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఏకపక్ష, నిరంకుశ వైఖరి గురించి పవార్, ఠాక్రేలకు జగన్ వివరించారు. ఓట్లు, సీట్ల కోసం రాజ్యాంగంలోని మూడో అధికరణను దుర్వినియోగం చేస్తూ.. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని నివేదించారు. దీనికి శరద్‌పవార్ స్పందిస్తూ.. ‘ముంగిట్లో ఎన్నికలు ఉండగా (రాష్ట్ర విభజనకు) కేంద్రానికి ఇంత తొందరపాటు ఎందుకు? రేపు ఎన్నికలు పూర్తయ్యాక ప్రజాభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు కదా!’ అన్న అభిప్రాయాన్ని జగన్ బృందం వద్ద వ్యక్తంచేసినట్లు తెలిసింది.

 

అలాగే.. ఓట్లు, సీట్ల దృష్టితో రాయలసీమను కూడా నిలువునా చీల్చే క్షుద్ర రాజకీయాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆ ప్రాంత సీనియర్ నాయకుడొకరు ప్రస్తావించినపుడు.. ‘అలా హేతుబద్ధత లేని విభజన సముచితం కాదు’ అని కూడా పవార్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఇక ఉద్ధవ్‌ఠాక్రే అయితే.. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజిస్తోందంటూ జగన్ బృందంతో ఏకీభవించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు తెలిపారు. ఈ భేటీల అనంతరం.. పవార్‌తో కలిసి వై.బి.చవాన్ హాల్ వద్ద, ఉద్ధవ్‌తో కలిసి మాతోశ్రీ వద్ద జగన్ మీడియాతో మాట్లాడారు. జగన్ చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
 
 ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది...
 ‘‘ఈ దేశంలో ఎప్పుడూ జరగనిది మొదటిసారిగా జరుగుతోంది. ఎక్కడైనా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత మాతృ  రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానాలు ఆమోదించటం ఆనవాయితీ. ఇప్పటివరకూ అలాగే చేశారు. కానీ దేశంలో తొలిసారిగా.. అదీ ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయనగా.. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం ఊసే లేకుండా విభజిస్తోంది. ఇంత అన్యాయం జరుగుతున్నపుడు పవార్ వంటి సీనియర్ రాజకీయవేత్తలు చూస్తూ ఊరుకుంటే.. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్‌తోనే ఆగిపోదు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ఇదో దుష్ట సంప్రదాయానికి దారితీస్తుంది.
 
 మిగతా ప్రాంతాలకూ వ్యాపిస్తుంది. రేపు మహారాష్ట్ర కావచ్చు.. ఎల్లుండి కర్ణాటక కావచ్చు.. ఆ తర్వాత తమిళనాడు కావచ్చు.. ఇలా ఏ రాష్ట్రంలోనైనా అప్రజాస్వామిక విభజనకు కేంద్రం తెగబడవచ్చు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా 272 మంది సభ్యుల మద్దతుంటే చాలు ఇష్టానుసారం ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తుంది. ఇక అధికారంలోకి రామని తెలిసిన ఏ పార్టీ అయినా ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాల విభజనకు పూనుకుంటుంది. మాతృ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా విభజనకు పూనుకుంటుంది. ప్రాంతీయంగా ఉన్న భావోద్వేగాలతో ఇలా చెలగాటమాడతారు. ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా ఖూనీ చేయటం తీవ్రమైన నేరం.
 
 విభజనకు విధివిధానాలు ఉండాలి...
 అరవై ఏళ్ల కిందట భాషాప్రయుక్త ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సిఫారసుల ద్వారా ఇవి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఒకే భాష మాట్లాడే తెలుగు వారి రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. అరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే.. అందుకు ఒక పద్ధతి, నియమాలు, నిబంధనలు ఉండాలి. రాష్ట్ర విభజనకు అసెంబ్లీలో, పార్లమెంటులో తీర్మానం తప్పనిసరి చేయాలి. ఏకగ్రీవ తీర్మానం సాధ్యం కానపుడు కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీతోనైనా ఆయా సభల్లో విభజన తీర్మానం నెగ్గాలనే నిబంధన తప్పక పెట్టాలి. ఈ మేరకు రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించాల్సిన అవసరముంది. ఈ విషయాన్ని శరద్‌పవార్‌కు బలంగా చెప్పాం. ఉద్దవ్‌ఠాక్రే సహా అందరి సహకారం కోరుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలాంటి చర్యలు అవసరమో, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులేమిటో పవార్ అర్థం చేసుకున్నారు. విభజన ప్రక్రియను స్తంభింపజేసేలా పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభల్లో మద్దతివ్వాలని ఉద్ధవ్‌ను కోరాను. ఆయన అంగీకరించారు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నా. పొత్తులు, కూటములకన్నా విభజన అనేది చాలా పెద్ద విషయం. దయచేసి ఈ విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. అందరూ ఆలోచించాల్సిన సమయమిది.’’
 
 ముంబైలో జగన్‌కు అపూర్వ స్వాగతం...
 ఒక్క రోజు పర్యటన కోసం సోమవారం ముంబై చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి నగరంలో అపూర్వ స్వాగతం లభించింది. ఠాణే, నవీ ముంబైలతో పాటు నగరంలోని అనేక ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రజలు ఉదయం శాంతాక్రజ్ విమానాశ్రయంతో పాటు వై.బి.చవాన్ ఆడిటోరియం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు ఉదయం నుంచే తెలుగు ప్రజలు శాంతాక్రజ్ విమానాశ్రయం వద్ద బారులు తీరారు. ‘జగన్ జిందాబాద్, జై జగన్, జై సమైక్యాంధ్ర’ అంటూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దపెట్టున నినదించారు.
 
 చెన్నై వెళ్లేందుకు జగన్‌కు అనుమతి
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెన్నైకి వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోర్టు ప్రధాన న్యాయాధికారి ఎన్.బాలయోగి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మద్దతు కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సోమవారం బాలయోగి విచారించారు. ఈ నెల 26 నుంచి 29వ తేదీ మధ్య ఏదో ఒక రోజు చెన్నై వెళ్లొచ్చునని, జయలలితతో అపాయింట్‌మెంట్ ఖరారయ్యాక, ఆ వివరాలన్నింటినీ సీబీఐకి తెలియచేయాలని బాలయోగి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
 కాంగ్రెస్‌ది విభజించు - పాలించు విధానం: ఉద్ధవ్
 బ్రిటిష్ వారి తరహాలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ‘విభజించు - పాలించు’ అనే విధానాన్ని అమలు చేస్తోందని, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ విభజనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే తమ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుందని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని మూడో అధికరణను దుర్వినియోగం చేయరాదన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బృందం తనతో భేటీ అయిన తర్వాత.. జగన్‌తో కలిసి ఠాక్రే మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డి ముంబైకి ప్రత్యేక విషయమై వచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేయటానికి ప్రయత్నిస్తోంది. ఢిల్లీలోని పెద్దలు అక్కడ కూర్చుని ఏమైనా చేయవచ్చని భావిస్తున్నారు. వాళ్లకు ఎలా నచ్చితే అలా చేస్తున్నారు. చివరికి ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేం నిరసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విభజనను మేం కూడా వ్యతిరేకిస్తున్నాం.
 
 ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా లభించదని భావించిన కాంగ్రెస్ ఈ విధంగా ఎన్నికలకు ముందు ఓట్ల రాజకీయం ప్రారంభించింది. అధికారంలో ఉన్నవాళ్లు ‘విభజించు - పాలించు’ అనే రీతిలో చేస్తున్నారు. బ్రిటిష్ వారి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానాలను మేం వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే మేం నిరసన వ్యక్తంచేస్తాం. ఆర్టికల్-3ను కేంద్రం దుర్వినియోగం చేయకూడదు. రాష్ట్ర విభజన అవసరమైతేనే చేయాలి. జగన్‌మోహన్‌రెడ్డితో మేం ఏకీభవిస్తున్నాం. మూడో అధికరణలో సవరణలు చేయాలి. ఎక్కడైనా రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే.. తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. అసెంబ్లీలో తీర్మానాన్ని మెజారిటీతో ఆమోదించిన తర్వాతనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి’’ అని ఆయన స్పష్టంచేశారు.  
 
 జగన్ లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవి: పవార్
 అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించటం, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించాల్సిన అవసరంపై జగన్‌మోహన్‌రెడ్డి లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవని తాము భావిస్తున్నామని ఎన్‌సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ పేర్కొన్నారు. ఈ అంశాలపై తమ పార్టీ కార్యవర్గ భేటీలో నిశితంగా చర్చిస్తామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ బృందం తనతో చర్చలు జరిపిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పవార్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. అయితే ఎన్‌సీపీ తొమ్మిది నెలల కిందటే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ.. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి జగన్ చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు.

 

కొన్ని న్యాయపరమైన విషయాలను ప్రస్తావించారు. ఏ రాష్ట్రాన్నైనా విభజించే ముందు రాష్ట్ర అసెంబ్లీని విశ్వాసం లోకి తీసుకోవాలన్న అంశాన్ని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీని విస్మరించి ముందుకెళ్లరాదని, అలా వెళ్తే అది తప్పుడు సంప్రదాయం అవుతుందని జగన్ నాతో అన్నారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఈ అధికరణను సవరించాలని, అందులో పునరాలోచనకు ఆస్కారం ఉండాలని చెప్పారు. జగన్ లేవనెత్తిన కీలకమైన ఈ రెండు అంశాలపై ఈ సమయంలో మా పార్టీ అభిప్రాయం కానీ, నిర్ణయం కానీ చెప్పలేను. కానీ మా పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుల ముందు ఈ రెండు అంశాలనూ ఉంచుతాను. వీటిపై సీరియస్‌గా చర్చిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గల శాసనసభను, శాసనసభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న కీలకమైన అంశాలపై నిశితంగా చర్చిస్తాం. అలా అభిప్రాయానికి వస్తాం. ఆ తర్వాత వెల్లడిస్తాం’’ అని ఆయన వివరించారు. జగన్‌తో భేటీ సందర్భంగా ఎన్నికల అవగాహనపై చర్చ జరగలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement