* ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారు
* ఢిల్లీ సమైక్య ధర్నాలో కేంద్రం, కాంగ్రెస్‌లపై జగన్ ఆగ్రహం
* సమస్యలపై అవగాహన లేకుండానే విభజన
* 60 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా విభజిస్తున్నారు
* రాష్ట్ర అసెంబ్లీ వద్దని చెప్పినాకూడా విభజన
* ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టారు
* వీరిపాలన కంటే బ్రిటిష్ వారి పాలనే నయమనిపిస్తోంది
* విడిపోతే తెలంగాణ, సీమాంధ్ర రెండూ నష్టపోతాయి
* ప్రగతిపథంలో నడవాలంటే రెండు ప్రాంతాలూ కలసే ఉండాలి
* ఈ మూడు రోజులే కీలకం.. ప్రతి సమైక్యవాదీ కలసిరావాలి
* కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని.. విభజన జరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయో కనీస అవగాహన లేకుండానే అప్రజాస్వామికంగా ముందుకెళ్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విభజించు - పాలించు సూత్రాన్ని అమలుచేస్తూ వీరికంటే బ్రిటిష్ పాలనే నయమేమో అన్న తరహాలో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహా మిగతా పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
రానున్న మూడు రోజులు కీలకం అని చెప్పిన జగన్.. విభజనపై ప్రతిపక్ష పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలోని ప్రతి సమైక్యవాదీ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి కలిసిరావాలని కోరారు. సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహించిన సమైక్య ధర్నాలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగంలో రాష్ట్ర విభ జన తీరును ఎండగట్టారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలూ రెండూ నష్టపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రం పురోగతి బాటలో సాగాలంటే రాష్ట్రంలోని మహానగరాలు, సముద్రాలు కలిసే ఉండాలని.. విమానాశ్రయాలు, నౌకారేవులు కలిసే ఉండాలని.. వాటిని వేరుచేయకూడదని పేర్కొన్నారు. ఢిల్లీ ధర్నాలో జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాం...
‘‘సమైక్యాన్ని కోరుతూ రాష్ట్రం నలుమూల నుంచి ఢిల్లీ చెవులకు సమైక్యవాదాన్ని వినిపించాలని, మన బాధను, గుండెల్లోనుంచి వస్తున్న ఆవేదనను వీరికి కనిపించేట్లు చేసేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. చలి తీవ్రంగా ఉన్నా లెక్కచేయకుండా ఇక్కడికు వచ్చిన అక్కలు, చెల్లెళ్లు, అన్నా, తమ్ముడూ, అవ్వా, అయ్యలకు చేతులు జోడించి శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ రోజు ఢిల్లీకి వచ్చి సమైక్య శంఖారావం పూరించి, విభజనపై కేంద్రం సాగిస్తున్న హేయమైన, అన్యాయమైన విధానాన్ని ప్రశ్నిస్తున్నాం.
చరిత్రలో లేని తరహాలో విభజన...
దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీలో అధికారం చేతుల్లో ఉందని అన్యాయంగా విభజన చేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా రాష్ట్రాలను విభజిస్తే అది అక్కడి ప్రజలు, అక్కడి అసెంబ్లీ ‘మమ్మల్ని విభజించండి’ అని చెప్పి ఆమోదముద్ర వేసినప్పుడు మాత్రమే జరిగింది. గత 60 ఏళ్లుగా ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా అసెంబ్లీ తీర్మానం లేకుండా విభ జించిన దాఖలాలు లేవు. ఏ రాష్ట్రాన్ని కూడా అధ్యయన కమిషన్లు సిఫారసు చేయకుండా విభజించలేదు. కానీ మన రాష్ట్రం విషయంలో మాత్రం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సైతం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమే అన్నింటికన్నా ఉత్తమమని చెప్పింది. అసెంబ్లీ మొత్తం విభజనకు వ్యతిరేకం, విభజించవద్దని చెప్తూ తీర్మానం చేసింది. అయినా ఢిల్లీలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..
మామూలుగా పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ బిల్లును ప్రవేశపెట్టాల్సి వస్తే.. స్పీకర్ వచ్చి కూర్చున్నాక సంబంధిత మంత్రి ఫలానా బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్తారు. స్పీకర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు సభ్యుల అనుమతి కోరుతారు. కానీ.. గురువారం నాడు లోక్‌సభలో స్పీకర్ వచ్చిన పదే పది సెకన్లలో బిల్లు ప్రవేశపెట్టారు. నాకైతే చేతులు పైకి ఎత్తండన్న మాటే వినపడలేదు. ఎవరూ చేతులు పెకైత్తినట్లూ కనిపించలేదు. ఎవరూ ‘అవును బిల్లును ప్రవేశపెట్టటానికి ఒప్పుకుంటున్నాం’ అని సంకేతాలు ఇవ్వలేదు. పార్లమెంటు సాక్షిగా అందరూ చూస్తుండగానే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేశారు. ఇది అన్యాయమని నేనూ, అద్వానీ, సుష్మాస్వరాజ్, సమాజ్‌వాది పార్టీ నేత, ఏఐడీఎంకే తంబిదొరై, బీజేడీ, జేడీయూ నేతలం కలిసి స్పీకర్ చాంబర్‌కు వెళ్లి చెప్పాం. ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అక్కడే ఉన్నారు. మేము చేసిన విన్నపాన్ని బేఖాతరు చేస్తూ సభలో బిల్లు ప్రవేశపెట్టేశామని బదులిచ్చారు. నాతో సహా అద్వానీ, సుష్మా, ఇతర నేతలంతా వాకౌట్ చేశాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు.
బ్రిటిష్ వారే నయమనిపిస్తోంది...
మంగళవారం (18వ తేదీన) పార్లమెంటులో బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సభలో బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారని అడిగేవారు లేరు. అడిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. నా కళ్లముందు ఇంతగా జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పుడూ చూడలేదు. బ్రిటిష్ కాలపు రోజుల్లోనూ ఇంత అన్యాయాన్ని చూసి ఉండరు. విభజించు - పాలించు తరహాలో వీరు ప్రవర్తిస్తున్నప్పడు బ్రిటిష్ వాళ్లే వీళ్లకన్నా మేలేమో అనిపిస్తోంది. రాష్ట్రాన్ని విభజిస్తున్న ఏ ఒక్కరికీ విభజనతో ఎలాంటి సమస్యలు వస్తాయో అవగాహనలేదు. 42 స్థానాల్లో ఒక్క స్థానం కూడా రాదేమోనని భయపడి కేవలం ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుతోంది.
నీటి కోసం రైతులు తన్నుకునే పరిస్థితి రాదా..?
రాష్ట్రాన్ని విభజిస్తే రైతుల పరిస్థితి ఏమిటి? కృష్ణానదిపై ఎగువన ఉన్న మహారాష్ట్ర అవసరాలు తీరాక, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప నీరు కిందకు రాని పరిస్థితి ఉంది. ట్రిబ్యునళ్లు, వాటర్ బోర్డులు ఉండగానే కొట్టుకునే పరిస్థితి ఉంది. రేపు మధ్యలో మరో రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపునీళ్లు తప్పితే మంచి నీరు ఎక్కడ ఉందని అడుగుతున్నా. కృష్ణా ఆయకట్టు కింద 11 జిల్లాలకు నీరందుతుండగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో సగభాగం, ఖమ్మం జిల్లాతో పాటు సీమాంధ్రలోని ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని విడగొడితే 11 జిల్లాల రైతులు నీటికోసం తన్నుకునే పరిస్థితి రాదా? హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మని సునాయాసంగా అంటున్నారు. 75 % సేల్స్ ట్యాక్స్ హైదరాబాద్ నుంచే వస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌కు 60 % నిధులు, ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. హైదరాబాద్‌ను పక్కనపెడితే తెలంగాణ, సీమాంధ్రల నుంచి 40 శాతం నిధులు, ఆదాయం వస్తున్నాయి. విభజన జరిగితే సీమాంధ్రకు కేవలం 20 శాతం ఆదాయం మాత్రమే ఉంటే వారు ఎలా బతుకగలుగుతారు? ఉన్నత చదవులు పూర్తి చేసిన విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలని కాలర్ పట్టుకొని అడిగితే ఎం సమాధానం చెప్తారు?
బంగాళాఖాతంలో కలుపుదాం రండి...
ఎలాంటి అవగాహన లేకుండా ప్రజల జీవితాలతో ఓట్లు, సీట్లు కోసం చెలగాటం ఆడుతున్నారు. ఈ అడ్డగోలు విభజనపై కేంద్రం తీరును ఎండగట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటికావాలి. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి 200 సీట్లు, బీజేపీకి వ ంద పైచిలుకు స్థానాలున్నాయి. వీరిద్దరి సీట్లు కలిస్తే మూడు వందల స్థానాలున్నాయి. ఈ సందర్భంగా బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నిజమైన ప్రతిపక్ష పార్టీగా ముందుకు రండి. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుదాం. రానున్న మూడు రోజులు మన రాష్ట్రానికి చాలా కీలకం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క సమైక్యవాదిని కోరుతున్నా. మనలో ఉన్న బేధాభిప్రాయాలు పక్కనపెడదాం. అందరం కలిసి బీజేపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలపై ఒత్తిడి తెచ్చి అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకుందామని పిలుపునిస్తున్నా. రేపు ఇక్కడ సమైక్య ర్యాలీ జరుగుతుంది. ఆ సమైక్య ర్యాలీలో మనం కూడా పాల్గొని వారు మనవాళ్లే అని చెప్పి కలిసికట్టుగా పోరాడుదాం.’’
హస్తినలో ‘సమైక్య’ కదం సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో సోమవారం నిర్వహించిన సమైక్య ధర్నా విజయవంతమయింది. ఉదయం 8 గంటల నుంచే సమైక్యవాదులు జంతర్‌మంతర్ పరిసరాలకు దండుకట్టారు. ‘జై జైగన్, జోహార్ వైఎస్సార్, సోనియా డౌన్‌డౌన్, కేసీఆర్ డౌన్‌డౌన్’ నినాదాలు హోరెత్తాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10.40కి ప్రాంగణానికి చేరుకుని ధర్నా ప్రారంభించారు. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న జాతీయ మీడియా చానళ్ల ప్రతినిధులు జగన్ ఇంటర్వ్యూల కోసం వరుసకట్టారు. ఢిల్లీలో జగన్ సమైక్య ధర్నాకు జాతీయ మీడియా అత్యంత ప్రాధాన్యమిచ్చింది. సమైక్యంపై మొదటి నుంచీ స్పష్టతతో ఉన్నది వైఎస్సార్‌సీపీ ఒక్కటేనంటూ జాతీయ చానళ్లు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. 11 గంటల ప్రాంతంలో వచ్చిన వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధర్నా పూర్తయేదాకా జగన్ పక్కనే కూర్చున్నారు. సాయంత్రం నాలుగింటికి జగన్ ప్రసంగించారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులన్నీ పార్లమెంటును ముట్టడించేందుకు కదిలాయి.
సచివాలయ ఉద్యోగుల ఫోరం నేతలు మురళీకృష్ణ, పి.వి.కష్ణయ్య, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, విద్యార్థి జేఏసీ నేతలు అడారి కిశోర్, డేవిడ్, సమైక్యాంధ్ర గెజిటెడ్ అఫీసర్స్ నేత ఎ.బి.పటేల్ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు బాలశౌరి, ఎం.వి.మైసూరారెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వరూప్, ధర్మాన ప్రసాదరావు, శ్రీకాంత్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, గుర్నాథ్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, సుచరిత, కృ ష్ణదాస్, కాపు రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, భూమన కారుణాకర్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, ఆదిరెడ్డి అప్పారావు, దేశాయ్ తిప్పారెడ్డి, నేతలు వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కొణతాల రామకృష్ణ, భూమా నాగిరెడ్డి, లక్ష్మీపార్వతి, రెహ్మాన్, వైఎస్ అవినాశ్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, జన క్ ప్రసాద్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, నిర్మలాకుమారి, శివభరత్‌రెడ్డి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.
గుండెపోటుతో మృతిచెందిన జోషికి నివాళి...
సోమవారం రాంలీలా మైదానంలో జరిగిన ధర్నాలో గుండెపోటుతో మృతిచెందిన ఎండీఓ జోషికి జగన్‌మోహన్‌రెడ్డి సభా వేదిక నుంచే నివాళులర్పించారు. జగన్‌తో పాటు ధర్నాకు హజరైనవారంతా సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు. కేంద్రం చేస్తున్న అన్యాయాలకు గుండెపోటుతో వ్యక్తులు చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ ఉసురు కేంద్రానికి తగులుతుంని జగన్ మండిపడ్డారు. అనంతరం పార్లమెంటుకు ర్యాలీగా తరలి వెళ్దామని సమైక్యవాదులకు ఇదే వేదికపై నుంచి జగన్ పిలుపునిచ్చారు.