
నేడు విజయనగరం, శ్రీకాకుళంలో విజయమ్మ పర్యటన
సాక్షి నెట్‌వర్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. విజయమ్మ పర్యటన వివరాలను ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. విజయమ్మ ఉదయం 8 గంటలకు విశాఖ నుంచి బయల్దేరనున్నారు. 9గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని రావాడ గ్రామానికి చేరుకుని దెబ్బతిన్న వంతెన, పంటపొలాలను పరిశీలిస్తారు. అనంతరం భోగాపురంలోని ఎస్సీ, బీసీ కాలనీలలో కూలిపోయిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడతారు.
తర్వాత పూసపాటిరేగ మండలంలో వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలను పరిశీ లించి రైతులను ఓదార్చనున్నారు. ఇక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలంలోని బుడుమూరుకు చేరుకుని గ్రామంలో గండిపడిన చెరువును పరిశీలిస్తారు. చెరువుకు గండిపడడంతో 4 వేల ఎకరాలలో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాధిత రైతులను విజయమ్మ ఓదార్చనున్నారు. అనంతరం శ్రీకాకుళంలో కూలిపోయిన ఇళ్లను పరిశీలిస్తారు. భోజన విరామం అనంతరం మీడియాతో మాట్లాడతారు. తర్వాత గార మండలంలోని కళింగపట్టణంలో మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో పర్యటిస్తారని రఘురాం వివరించారు.
రేపు ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో: అలాగే, వైఎస్ విజయమ్మ గురువారం ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాలతోపాటు, ఖమ్మం అర్బన్ మండలంలో దెబ్బతిన్న పంటలను విజయమ్మ పరిశీలించనున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. విజయమ్మ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.