రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించాల్సి ఉందని..
జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వండి
సీబీఐ కోర్టుకు న్యాయవాది వినతి
జగన్ పిటిషన్ విచారణార్హం కాదు.. మినహాయింపు ఇవ్వొద్దు: సీబీఐ
నిర్ణయాన్ని ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడైన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తరచుగా కోర్టు వాయిదాలకు హాజరుకావడం అసౌకర్యంగా ఉందని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరుగనున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన న్యాయవాదిగా తాను కోర్టు విచారణకు హాజరవుతానని, జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.
తన సంస్థల్లో పెట్టుబడుల కేసు విచారణకు సంబంధించి జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న హాజరు మినహాయింపు (స్పెషల్ వకాలత్) పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి బుధవారం విచారించారు. జగన్ తరఫున అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుని హాజరు అవసరం లేదని భావించినప్పుడు మినహాయింపు ఇచ్చే అధికారం న్యాయమూర్తికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఉటంకించారు. ప్రస్తుతం కేసు విచారణ అభియోగాల నమోదు దశలోనే ఉందని.. ఈ దశలో జగన్ హాజరు అవసరం లేదని, సీఆర్‌పీసీ సెక్షన్ 205 ప్రకారం ఆయన హాజరుకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కోర్టు ఎప్పుడు ఆదేశించినా జగన్ హాజరవుతారని నివేదించారు.
ఇదే కేసులో నిందితునిగా ఉన్న హెటిరో డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి హాజరుకు కోర్టు ఇప్పటికే మినహాయింపు ఇచ్చిందని ప్రస్తావించారు. సీబీఐ తరఫున వాదన వినిపించిన స్పెషల్ పీపీ సురేంద్ర.. జగన్‌మోహన్‌రెడ్డికి హాజరు మినహాయింపు ఇవ్వడం కుదరదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం సమన్లు జారీ చేసే కేసుల్లో మాత్రమే హాజరుకు మినహాయింపు ఇస్తారని.. ఇది వారెంట్ కేసు కాబట్టి జగన్ వేసిన పిటిషన్ విచారణార్హం కాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు.. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ మంత్రి గీతారెడ్డి సమర్పించిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయటానికి సీబీఐ గడువు కోరిన నేపధ్యంలో విచారణను కోర్టు ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.