వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు.
తదుపరి విచారణ ఆగస్టు 11కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. అలాగే ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణతోపాటు పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్‌రెడ్డి, పెన్నా ప్రతాప్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్‌లు బీపీ ఆచార్య, శ్యాంబాబు, ఆదిత్యనాథ్‌దాస్, మన్మోహన్‌సింగ్ తదితరులు హాజరు కాగా మిగిలిన వారు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ కేసులో దాఖలు చేసిన మొదటి చార్జిషీట్ (సీసీ 8)లో నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియను చేపట్టాలని సీబీఐ స్పెషల్ పీపీ సురేంద్ర కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి బాలయోగి...డిశ్చార్జ్ పిటిషన్లపై ముందుగా వాదనలు వినిపించాలని, వాటిపై నిర్ణయం తీసుకున్న తర్వాతే అభియోగాల నమోదు ప్రక్రియపై వాదనలు వింటామని సీబీఐ స్పెషల్ పీపీకి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా సీనియర్ ఐఏఎస్ అధికారి రత్నప్రభపై మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆ తీర్పును రత్నప్రభ తరఫు న్యాయవాది ప్రత్యేక కోర్టుకు సమర్పించారు.