సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక విధానాలు, హామీల అమలులో పూర్తి వైఫల్యంతో అన్ని వర్గాల ప్రజలు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న నేపథ్యంలో... వారికి అండగా ఉంటూ భరోసా కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్ర నవంబర్ ఆరో తేదీనుంచి ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రజలకు భరోసాగా తాను పాదయాత్ర చేస్తున్నందున ఆరునెలల పాటు కోర్టుకు వ్యక్తిగత హాజరునుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించారు.
అందుకు అనుమతించని సీబీఐ కోర్టు ప్రతి శుక్రవారం హాజరుకావాలని సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేపట్టేందుకు ముందు నిర్ణయించిన రెండో తేదీ గురువారం కావడం, మరునాడే శుక్రవారం రావడంతో యాత్ర తేదీలో స్వల్ప మార్పులు చేసినట్లు పార్టీవర్గాల సమాచారం. చేపట్టిన మరునాడే పాదయాత్ర నిలిచిపోయేలా కాకుండా మూడు, నాలుగు రోజులు కొనసాగింపు ఉండేందుకు వీలుగా నవంబర్ ఆరో తేదీ నుంచి యాత్రను చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ మేరకు జగన్ పాదయాత్రకు రెండు రోజుల ముందు తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, అనంతరం కడప దర్గా, కడప చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం పాదయాత్రను చేపట్టనున్నారని ఆయన వివరించారు.
జగన్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 2 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రతీ శుక్రవారం జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపునివ్వాలన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ప్రతీ శుక్రవారం జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో కేసులపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతీ శుక్రవారం విచారణ జరుపుతోంది. ఈ విచారణకు జగన్‌తో పాటు మిగిలిన వారందరూ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వస్తోంది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలతో పాటు సామాన్యుల కష్టనష్టాలను తెలుసుకునేందుకు నవంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో తనకు ఆరు నెలల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ జగన్ ఇటీవల సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు తన బదులు తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతినివ్వాలని సీఆర్‌పీసీ సెక్షన్ 371 కింద దాఖలు చేసిన పిటిషన్‌లో కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపి తీర్పును వాయిదా వేసిన ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment