హామీలపై బాబును, మంత్రులను నిలదీద్దాం | YSRCP call to the public | Sakshi
Sakshi News home page

హామీలపై బాబును, మంత్రులను నిలదీద్దాం

Published Sun, Sep 13 2015 1:46 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

హామీలపై బాబును, మంత్రులను నిలదీద్దాం - Sakshi

హామీలపై బాబును, మంత్రులను నిలదీద్దాం

- ప్రజలకు వైఎస్సార్‌సీపీ పిలుపు...
- ప్రచార కరపత్రం విడుదల

సాక్షి, హైదరాబాద్:
ఎన్నికలకు ముందు ఎన్నో మాయమాటలు చెప్పి ఓట్లేయించుకుని అధికారంలోకొచ్చాక వాటినేవీ అమలు చేయకుండానే మళ్లీ మాయమాటలతో ఊళ్లలోకి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, ఆయన మంత్రులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ‘చంద్రబాబు చెప్పింది ఏమిటి? చేస్తున్నదేమిటి? : సీఎం బాబును ప్రశ్నిద్దాం- నిలదీద్దాం’ అంటూ ప్రచార ఉద్యమానికి పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రచార కరపత్రాలను శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్, వాసిరెడ్డి పద్మ, సాగి దుర్గాప్రసాదరాజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ తిరిగి అధికారంలోకొచ్చి 14-15 నెలల కాలం పూర్తయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండానే ‘చంద్రన్న విజయాల’ పేరిట విజయయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్నికలముందు ఇచ్చిన హామీలు, టీడీపీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు తమవద్ద ఉంచుకోవాలని.. అందులో ఏ హామీ నెరవేర్చారంటూ సీఎం, మంత్రులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.
 
‘తాడిపూడి’ నీళ్లిస్తూ.. ‘పట్టిసీమ’ ప్రచారం
పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి తాను నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. పట్టిసీమ ద్వారా ఇప్పటికీ రైతులకు చుక్కనీరు విడుదల చేయలేదు. పట్టిసీమలో 24 మోటార్లుంటే ఒక్కటీ వినియోగంలోకి రాలేదు. వైఎస్ అధికారంలో ఉన్నప్పడు పూర్తి చేసిన తాడిపూడి ప్రాజెక్టుద్వారా నీళ్లు విడుదల చేస్తూ పట్టిసీమద్వారా నీళ్లిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒట్టి మట్టి పట్టిసీమను జాతికి అంకితం చేశారు. బిల్లులు, బోనస్‌లు కాంట్రాక్టర్లకు అంకితం చేశారు. ప్రాజెక్టును సకాలం పూర్తి చేస్తే బోనస్ అనే కొత్త విధానాన్ని ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. పట్టిసీమ ప్రాజెక్టులో 16.9 శాతం బోనస్ ఇచ్చారు. రేపు ఇంకొక ముఖ్యమంత్రి సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తే 50 శాతం బోనస్ అంటే పరిస్థితి ఎక్కడికి పోతుంది? చంద్రబాబును తీరును చూసి.. భవిష్యత్‌లో మరో సీఎం ప్రాజెక్టు శంకుస్థాపన చేసినరోజే జాతికి అంకితం చేస్తున్నామనే స్థాయికి వెళితే.. పరిస్థితేమిటి?
 
వడ్డీ డబ్బులు ఇవ్వలేదుగానీ..

విభజన జరిగిన తరువాత ఏపీలో రైతుల బ్యాంకు అప్పులు రూ.87,612 కోట్ల వరకు ఉంటాయని తెలిసిన తరువాతే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల వరకు ప్రతిచోటా ఇదేమాట చెప్పారు. రూ.87 వేల కోట్ల మేరకు రైతుల అప్పులుంటే.. గతేడాది, ఈ ఏడాది ఇప్పటివరకు రూ.ఏడువేల కోట్లు మాత్రమే రైతుల అప్పులకు డబ్బులు జమచేశారు. రూ.87 వేల కోట్లకు వడ్డీనే ఇప్పటికి రూ.18 వేల కోట్లదాకా అయింది. వడ్డీలో మూడు వంతు కూడా ప్రభుత్వం జమ చేయలేదు. రూ.ఏడువేల కోట్లు బ్యాంకులకిచ్చి రూ.24 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసినట్టు మంత్రులు ప్రచారం చేస్తున్నారు.
 
ఒక్క రూపాయైనా మాఫీ అయిందా?
డ్వాక్రా రుణాల్ని పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల ముందు హామీనిచ్చారు. ఇప్పటివరకు ఎక్కడైనా ఒక్క రూపాయి అయినా డ్వాక్రా రుణం మాఫీ అయిందా? ఈ విషయంలో రోజూ ఎన్నో మాయమాటలు చెబుతూ.. ఇటీవల ఒక్కొక్క మహిళకు రూ.మూడువేల చొప్పున బ్యాంకుల్లో జమ చేశారు. అవి కూడా రుణాల మాఫీకి కాదు. కొత్త అప్పులు పుట్టడానికి. రాష్ట్రంలో గతంలో 95 శాతంమంది మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఇప్పుడు డ్వాక్రా వ్యవస్థనే చంద్రబాబు సర్కారు పూర్తిగా నాశనం చేసింది.
 
నిరుద్యోగ భృతి ఊసే లేదు..
చంద్రబాబు అధికారంలోకి రావడమే తరువాయి.. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చినట్టేనని ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. గోడలమీద అదే రాశారు. ఇంటింటికీ కరపత్రాలు పంచారు. కానీ గోడలపై రాసిన రాతలు నీటిమీద రాతలయ్యాయి. ఇప్పుడసలు ఆ ఊసే లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సరిగా అమలు కావట్లేదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు అసలే లేదు.
 
హోదా అడగడానికి ఎందుకీ మెతక?
ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా అడగడానికి చంద్రబాబు ఎందుకు మెతకగా ఉంటున్నారు? ఎందుకివ్వరని కేంద్రాన్ని ప్రశ్నించడానికి మొహమాటమెందుకు? ఇటీవల ఈయనకు ఎదురైన ఇబ్బందులనుంచి బయటపడాలంటే కేంద్రప్రభుత్వ సహకారం అవసరం. అందుకే తన స్వప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాల్ని చంద్రబాబు తాకట్టు పెడుతున్నారు.
 
ఆ గొంతు ఎవరిది?
ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఎమ్మెల్యేతో మాట్లాడిన గొంతు ఎవరిది.. చంద్రబాబుదా.. కాదా? ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి చంద్రబాబు మకాం మార్చుతూ.. కృష్ణా రివర్ కన్జర్వేటివ్ ఏరియాలో ఉన్న ఇంటిలో గృహప్రవేశం చేశారు. గతంలో అదే ప్రాంతంలో భవనం నిర్మించుకున్నందుకుగాను ఎంపీ గోకరాజు గంగరాజుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మరి ఇప్పుడు సీఎం అదే ప్రాంతంలో గల ఇంటిలో చేరగానే నిబంధనలు మారిపోతాయా? చంద్రబాబు ఉంటున్నారని ఈమధ్య ఆ ప్రాంతంలో నిత్యం 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. రాజధానిలో భూములు కోల్పోయిన రైతులు ఆందోళనలు చేస్తారని అనుమానపడి అమలు చేస్తున్నారేమో! సెక్షన్ 144ను దుర్వినియోగం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement