ప్రత్యేక హోదాపై పక్కదోవ పట్టిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా చాకచక్యంగా ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాక చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ప్రజలను ఏమార్చే విధంగా ఉందని విమర్శించారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మార్గదర్శకాలు అనుమతించవని చంద్రబాబు చెబుతున్నారని, ప్రత్యేక ప్యాకేజీ వైపు దృష్టిని మళ్లించి ప్రజలకు నచ్చ జెప్పాలని చూస్తున్నారన్నారు.
కానీ విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి, రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) కలసి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాయని, ఇపుడు ఆ హామీని అమలు చేయమంటున్నామని, ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని ధర్మాన తేల్చి చెప్పారు. విభజనతో ఏపీకి జరిగే నష్టాన్ని ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా పూడుస్తామని భరోసా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల గురించి ఆలోచించాలి కానీ చంద్రబాబు ఎందుకు ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు.
కేంద్రం అంటే భయమెందుకు?
విజయవాడ విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడిన తీరు, మీడియాపై అసహనం ప్రదర్శించడం చూస్తే ఆయన మైదానం వదలివేసి వెళ్లిపోతున్నారని స్పష్టం అవుతోంది. కేంద్రం అంటే ఆయనకు భయమెందుకు? కేసులు పెడతారనా? అని ధర్మాన మండిపడ్డారు. ప్రత్యేక హోదా హామీని అమలు చేసి తీరాలనేది వైఎస్సార్‌సీపీ వైఖరి అని, అందు కోసమే తాము పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా చేసిన తరువాత హడావుడిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలసిన టీడీపీ కేంద్రమంత్రులు, ఎంపీలు బయటకు వచ్చి ప్యాకేజీ అంటూ మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటానికి వారికి అధికారం ఎవరిచ్చారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని జైట్లీ అన్నపుడు ఎందుకు వీరు అభ్యంతరం తెలుపలేదన్నారు.
సీమకూ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీలు ఏవీ?
విభజన చట్టంలో వెనుకబడిన ఉత్తరాంధ్రకు అవసరమైనంత ప్యాకేజీ, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏమీ చేయక పోయినా చంద్రబాబు అడగడం లేదని విమర్శించారు. చంద్రబాబు ఐదేళ్ల పదవీకాలంలో మూడో వంతు ఇప్పటికే గడిచి పోయిందని ఇంకెప్పుడు ఆయన రాష్ట్రం తరపున పోరాడతారని ప్రశ్నించారు. విభజన జరిగాక ఇప్పటికి రాష్ట్రానికి సుమారు పది కేంద్ర సంస్థలు వస్తే అందులో ఒక్కటి కూడా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.