
చేనేత కార్మికులకు యూవిన్ కార్డులు: దత్తాత్రేయ
మున్సిపల్ కార్మికుల సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు
సెప్టెంబర్ 2న కార్మికులు చేపట్టే సమ్మెపై ప్రధానితో చర్చిస్తాం
దత్తాత్రేయతో అసెంబ్లీ స్పీకర్ భేటీ
న్యూఢిల్లీ: అసంఘటిత కార్మిక గుర్తింపు సంఖ్య (యూవిన్) కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను చేనేత కార్మికులకు వర్తింపచేసేందుకు కేంద్ర కార్మిక శాఖ ద్వారా కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం మంగళవారం దత్తాత్రేయను కలసి చేనేత కార్మికుల డిమాండ్లపై వినతిపత్రాన్ని అందజేసింది. చేనేతకారుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు మరిన్ని విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణలో టెక్స్‌టైల్, హ్యాండ్లూం పార్కులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను కోరుతామని మంత్రి చెప్పారు. ఆగస్టు 7న జాతీయ చేనేత కార్మిక దినోత్సవంగా జరిపేందుకు నిర్ణయించడం సంతోషకరమని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న కార్మిక సంఘాలు జరపతలపెట్టిన సమ్మె విషయంలో ప్రధాని మోదీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదన్నారు.
రాజమండ్రి దుర్ఘటనపై విచారం..
రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనపై మంత్రి దత్తాత్రేయ విచారం వ్యక్తం చేశారు. పవిత్ర దైవ సన్నిధిలో ఇలాంటి విషాద ఘటనలు చోటుచేసుకోవడం మనస్తాపానికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి బండారు దత్తాత్రేయతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే కలసినట్లు దత్తాత్రేయ వెల్లడించారు.