
కష్టాల్లో నటి భూమిక!
అక్కైనైనా, వదినైనా అలాంటి ఇంకే పాత్రలనై చేయడానికి రెడీ అంటోందట నటి భూమిక. ఈ భామ బహు భాషానటి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్‌కు జంటగా భద్రి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు నాయకిగా పరిచయం అయిన భూమికకు రోజాకూట్టం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తరువాత సూర్యతో సిల్లన్ను ఒరు కాదల్, సిత్తిరైయిల్ ఒరు నిలాస్సోరు లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. ప్రభుదేవాకు జంటగా నటించిన కళవాడియ పొళుదుగళ్ చిత్రం నిర్మాణం పూర్తి అయ్యి చాలా ఏళ్లే అయినా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.
తెలుగులోనూ ఖుషీ, సింహాద్రి వంటి మంచి విజయవంతమైన చిత్రాల్లో నటించినా ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే యోగా మాస్టర్ భరత్‌ను ప్రేమించి పెళ్లి చేసుక్ను భూమిక చిత్రాలను తగ్గించుకుంది. బిడ్డకు తల్లి అయిన భూమిక తన భర్తను నిర్మాతగా నిలబెట్టే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుంది. ఈ విషయంలోనే భర్త భరత్‌తో మనస్పర్థలు తలెత్తాయనే ప్రచారం ఆ మధ్య జోరుగా సాగింది. విషయం విడాకుల వరకూ వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్‌చల్ చేసింది. అయితే తన వ్యక్తిగత విషయాల గురించి నటి భూమిక ఎక్కడా బయట పెట్టలేదు. అయితే తను ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు టాక్.
దీంతో మళ్లీ నటనపై దృష్టి సారించిన భూమికకు హీరోయిన్ అవకాశాలు ముఖం చాటేశాయి. ఎంఎస్.ధోని అనే హిందీ చిత్రంలో ధోనికి అక్కగా చిన్న పాత్ర పోషించడానికి కూడా వెనుకాడలేదు. ఆ తరువాత కూడా భూమికకు అవకాశాలు రావడంలేదు. ఇక లాభం లేదని అవకాశాల వేటలో పడ్డ భూమిక అక్క, వదిన లాంటి పాత్రల్లో నటించడానికి రెడీ అంటూ తన సన్నిహితులతో చెబుతున్నారట. మరి భూమిక గోడును కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు ఆలకిస్తాయా? అలాంటి అవకాశాలతో ప్రోత్సహిస్తాయా అన్నది వేచి చూడాల్సిందే.