- 26 లేదా 27న సమావేశానికి అవకాశం: షిండే
వచ్చేవారం మరోసారి జీవోఎం భేటీ
Published Fri, Nov 22 2013 1:56 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీవోఎం) భేటీ గురువారం అసంపూర్తిగా ముగిసింది. ఇద్దరు సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మరోసారి సమావేశం అనివార్యమైంది. నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో సమావేశానంతరం హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మీడియాతో మాట్లాడారు. ‘‘జీవోఎం భేటీ ముగిసింది. ఇద్దరు సహచరులు హాజరుకాలేదు. చిదంబరం విదేశాల్లో ఉన్నారు. గులాంనబీ ఆజాద్ కూడా లేరు. అందువల్ల వచ్చేవారం మరోసారి సమావేశం జరుగుతుంది. ఎప్పుడనేది చిదంబరం వచ్చాక మాట్లాడి నిర్ణయిస్తాం. సాధ్యమైనంత త్వరగానే ప్రక్రియను ముందుకు తీసుకువెళతాం..’’ అని చెప్పారు. గురువారం నాటి సమావేశానికి హాజరైన మంత్రి వీరప్పమొయిలీ.. తదుపరి జీవోఎం భేటీ ఈనెల 27వ తేదీన ఉండవచ్చంటూ మీడియా అడిగిన ఒకప్రశ్నకు జవాబిచ్చారు. తదుపరి జీవోఎం సమావేశం 26 లేదా 27 తేదీన ఉండవచ్చని షిండే కూడా విలేకరులతో ఇష్టాగోష్టిలో చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును పెడతామని పునరుద్ఘాటిం చారు. అయితే బిల్లు అసెంబ్లీకి ఎప్పుడు వెళుతుందీ, కచ్చితంగా ఏ రోజున పార్లమెంటులో పెడతారనే ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా.. ‘అవ న్నీ నిర్ణయం అవుతాయి’ అని మాత్రమే చెప్పారు.
Advertisement