న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వాటిని తిప్పికొట్టారు. కొన్ని శక్తులు అబద్ధాలపై ఆధారపడి నెహ్రూపై విమర్శలు గుప్పిస్తున్నాయని, వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే వారి ఉద్దేశమని ఆమె అన్నారు. ప్రతి గొప్ప నాయకునికీ విమర్శలు తప్పవని, నెహ్రూ జీవితకాలంలోనూ ఆయనను విమర్శించే వారు ఉండేవారన్నారు. అయితే, ప్రస్తుతం దేశంలోని కొన్ని శక్తులు ఎలాంటి నిశిత పరిశీలన లేకుండా నెహ్రూపై బురద చల్లుతున్నాయని అన్నారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటైన జవహర్‌లాల్ నెహ్రూ స్మారకోపన్యాసం-2013 కార్యక్రమంలో సోనియా మాట్లాడారు. నెహ్రూ స్మారక నిధి చైర్‌పర్సన్ హోదాలో ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జూడిత్ ఎం బ్రౌన్ ఫ్రం ప్రిజన్ టు తీన్‌మూర్తి: ది మేకింగ్ ఆఫ్ ఎ ప్రైమ్‌మినిస్టర్’ అనే శీర్షికన నెహ్రూ జీవితంపై ప్రసంగించారు. ప్రపంచంలోని గొప్ప దార్శనికుల్లో నెహ్రూ ఒకరని బ్రౌన్ అన్నారు. కాంగ్రెస్ నేత కరణ్ సింగ్ మాట్లాడుతూ, నెహ్రూపై బురదచల్లే యత్నాలు అర్థంలేనివని అన్నారు. దేశ విభజన తర్వాత ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటూ నెహ్రూ పాలనాపగ్గాలు చేపట్టారో అవగాహన లేనివారు మాత్రమే ఆయనపై విమర్శలకు దిగుతారన్నారు. కాగా, హైదరాబాద్‌లో ఆగస్టు 11న జరిగిన సభలో మోడీ, కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో నెహ్రూ విఫలమయ్యారని విమర్శించిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్రానంతరం 500 సంస్థానాలను భారత్‌లో విలీనం చేసే బాధ్యతలను పటేల్‌కు అప్పగిస్తే, ఆయన విజయవంతంగా నిర్వహించారన్నారు.