సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్ దేశం ఘన నివాళి అర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ నెహ్రూకు నివాళులర్పించారు. పండిట్ జయంతి సందర్భంగా ట్విటర్ వేదికగా ప్రధాని స్పందిస్తూ ‘మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’అని పేర్కొన్నారు. ఇక న్యూఢిల్లీలోని శాంతివనంలోని నెహ్రూ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నెహ్రూ సమాధిని సందర్శించి నివాళులర్పించారు.
కాగా, 1889 నవంబరు 14న అలహాబాద్‌లో జన్మించిన నెహ్రూ.. మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణిల తొలి సంతానం. జాతీయోద్యమంలో పాల్గొని రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పని చేసిన ఈయన.. స్వాతంత్రానంతరము దేశానికి తొలి ప్రధాని అయ్యారు. చిన్న పిల్లలంటే అమితంగా ఇష్టపడే నెహ్రూ.. వారికి ‘చాచా నెహ్రూ’గా మారిపోయారు. అందుకే ఆయన పుట్టిన రోజు నవంబరు 14న ‘బాలల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. సుదీర్ఘకాలం పాటు స్వతంత్ర భారత్‌కు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ 1964, మే 27న మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment