విభజనకు పూర్తిగా సహకరిస్తాం! | We support for State bifurcation, says Seemandhra Minister to GoM | Sakshi
Sakshi News home page

విభజనకు పూర్తిగా సహకరిస్తాం!

Published Tue, Nov 19 2013 1:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

విభజనకు పూర్తిగా సహకరిస్తాం! - Sakshi

విభజనకు పూర్తిగా సహకరిస్తాం!

  • కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
  •  జీవోఎంకు స్పష్టం చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు
  •  (న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
     
    రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీమాంధ్ర కేంద్ర మంత్రులు తెలిపారు. విభజన ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తామని జీవోఎంకు స్పష్టం చేశారు. విభజనతో సీమాంధ్రలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పరిధిని ఢిల్లీ, పుదుచ్చేరి తరహా కేంద్ర పాలితప్రాంతంగా ప్రకటిస్తే సీమాంధ్ర ప్రజల్లో 80 శాతానికి పైగా సంతృప్తి చెందుతారని చెప్పారు. సీమాంధ్రకు ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే భద్రాచలం డివిజన్‌లో ముంపునకు గురయ్యే ప్రాంతాల్ని కచ్చితంగా సీమాంధ్రలో కలపాలని కోరారు. అదే సమయంలో కొత్త రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై అభిప్రాయభేదాలున్నందున నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ముందు కెళ్లాలని సూచించారు. కొత్త రాజధాని నిర్మాణానికి సాయం చేయాలని కోరారు. ఈ మేరకు రూపొందిం చిన 7 పేజీల నివేదికను జీవోఎంకు సమర్పించారు. సోమవారం ఉదయం పళ్లంరాజు నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేడీ శీలం, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మిలు సమావేశమయ్యారు. నివేదికను రూపొందించారు. 11 గంటలకు అందరూ కలిసి నార్త్‌బ్లాక్‌కు చేరుకున్నారు. జీవోఎం సభ్యులకు నివేదికను అందజేశారు. తరువాత కొద్దిసేపటికి మరో సీమాంధ్ర కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ చేరుకుని జీవోఎం సభ్యులకు విడిగా నివేదిక అందజేయడంతోపాటు తన అభిప్రాయాలను చెప్పేసి మిగతావారికంటే ముందే బయటకు వచ్చారు. వాస్తవానికి 10 గంటలకే నార్త్‌బ్లాక్‌కు వచ్చిన దేవ్.. కొందరు తనను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ తిరిగి వెళ్లిపోయి గంట తరువాత మళ్లీ వచ్చారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు..  కేంద్ర మంత్రులంతా తమ అభిప్రాయాలను జీవోఎంకు చెప్పారు. ఒక్కొక్కరు 10 నిమిషాలకుపైగానే మాట్లాడారు. 
     
     అందరూ స్థూలంగా విభజనకు అంగీకరిస్తూనే తద్వారా తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటూ కోర్కెల చిట్టా విప్పారు. కిశోర్ చంద్రదేవ్ మినహా మిగిలిన వారంతా హెచ్‌ఎండీఏ పరిధిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరారు. 12.45 గంటలకు బయటికొచ్చిన మంత్రుల తరఫున జేడీ శీలం మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన విషయంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని మేము సవాల్ చేయట్లేదు. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. విభజనపై తొందరపడొద్దని, అనేక సమస్యలు వస్తాయని జీవోఎంకు చెప్పాం. పునరాలోచించాలన్నాం. విభజన అనివార్యమైతే మాత్రం సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించాలని కోరాం. రాయలసీమ తాగునీటి సమస్యనూ పరిష్కరించాలన్నాం. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత విషయంలో కొందరు నేతలు ‘గెటవుట్’ అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నందునే యూటీ చేయాలని కోరుతున్నాం. సీమాంధ్రులు 30 లక్షల మంది హైదరాబాద్‌లో నివసిస్తున్నందునే తెలంగాణలో కొత్తగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగాయనే విషయాన్ని గుర్తు చేశాం. కృష్ణా-గోదావరి నదులకు సంబంధించి సాగునీటి పంపిణీతో పాటు హ్రందీ నీవా, గాలేరు నగరి, ఆర్‌డీఎస్, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశాలను ప్రస్తావించాం’’ అని శీలం చెప్పారు. జీవోఎం సభ్యు లు సానుకూలంగా స్పందించారని, సీమాంధ్ర ప్రజల అభిలాష నెరవేరుస్తారనే నమ్మకం ఏర్పడిందన్నారు. 
     
     వైజాగ్‌లో రాజధాని ఏర్పాటు చేయాలి: కిశోర్ 
     సీమాంధ్ర కే ంద్ర మంత్రుల అభిప్రాయాలను మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న కిశోర్ చంద్రదేవ్ తన వైఖరి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని జీవోఎంకు చెప్పారు. ఉమ్మడి రాజధాని పేరు తో కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయకుండా తప్పించుకునే ప్రమాదముందని నివేదికలో పేర్కొన్నారు. విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రజలు వ్యయప్రయాసలకోర్చి తెలంగాణను దాటుకుంటూ వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. తక్షణమే విశాఖలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదను కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వెనుకబడ్డ రాయలసీమ ప్రజలు సీమాంధ్రలో కలిసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపట్లేదని, అవసరమైతే ఆ 4 జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. అది సాధ్యంకానట్లయితే రాయలసీమను తెలంగాణలో కలపాలని సూచించారు. రాయలసీమను జిల్లాల వారీగా విభజించి సగం తెలంగాణలో, సగం ఆంధ్రాలో కలపడం ఏమాత్రం సరికాదన్నారు. పనబాక లక్ష్మి కూడా కొత్త రాజధానిని కోస్తాలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఐదు పేజీల నోట్‌ను జీవోఎం సభ్యులకు ప్రత్యేకంగా సమర్పించారు. 
     
    7 పేజీల నోట్‌లోని ముఖ్యాంశాలు..
    • హెచ్‌ఎండీఏ పరిధితో పాటు సీమాంధ్రను కలిపే మూడు జాతీయ రహదారులను కూడా అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలి.
    • నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అధీనంలోనే ఉండాలి.
    • 1956కు ముందున్నట్టుగా భద్రాచలం, మునగాల, అశ్వారావుపేట ప్రాంతాలను యథాతథంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కొనసాగించాలి.
    • విభజన బిల్లును పరిగణనలోకి తీసుకోవడానికి రాష్ట్ర అసెంబ్లీకి తగినంత సమయం ఇవ్వాలి.
    • తెలంగాణ రాష్ట్రం, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు మధ్య.. నియోజకవర్గాలు, న్యాయ, చట్టబద్దమైన, ఇతర పరిపాలనా సంస్థల మధ్య నిర్దిష్టమైన సరిహద్దులు ఏర్పాటుచేయాలి.
    • హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో పరిపాలన, న్యాయపరమైన సమస్యలు రాకుండా, రెండు రాష్ట్రాల పరిపాలన సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నివసించే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలగొద్దు. ఇరు ప్రాంతాల నుంచి పోలీసు నియామకాలు చేపట్టాలి. కేంద్ర బలగాలను ఉంచాలి.
    • రాష్ట్రంలో ప్రాంతాలకతీతంగా వెనుకబడిన అన్ని జిల్లాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి.
    • కొత్త రాజధాని నిర్మాణం, రాజ్‌భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు, నివాస సముదాయాలు, విద్యుత్, రోడ్డు, రైలు మార్గాలు వంటి కీలక అంశాలకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు కేంద్రమే బాధ్యత వహించాలి.
    • నిర్దిష్ట గడువును విధించి, ఆ గడువులోగా సీమాం ధ్రకు రాజధాని పూర్తిచేయాలి. 20 ఏళ్ల పాటు ఏటా రూ.40 వేల కోట్లు కేంద్రమే ఇవ్వాలి.
    • కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా హైకోర్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, మహిళా, మైనార్టీ, మానవహక్కుల కమిషన్ వంటి చట్టబద్ధ సంస్థలను ఉమ్మడిగానే కొనసాగించాలి. పోలీసు నియామకాల్లో 14ఎఫ్ పునరుద్ధరించాలి.
    • కొత్త రాజధానిలో పూర్తిస్థాయి హైకోర్టుతో పాటు, కర్నూలు, విశాఖపట్నంలో హైకోర్టు బెంచీలను ఏర్పాటుచేయాలి. ఆంధ్రా రాజధానికి సుప్రీంకోర్టు బెంచీని కూడా ఏర్పాటుచేయాలి.
    • పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేయాలి. నదీ జలాలు, సాగుప్రాజెక్టుల పంపకాలు, బొగ్గు,  ఆయి ల్, గ్యాస్ పంపకాల్లో సమన్యాయం పాటించాలి. 
    • విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వివాదరహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి ఆస్తులు, పబ్లిక్ ఫైనాన్స్, కార్పొరేషన్ల పంపకాలు జాగ్రత్తగా చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పూర్తి అప్రమత్తతతో పంపిణీ చేయాలి.
    • 371(డీ)ని పరిష్కరించాలి. న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలి. రాష్ట్ర విభజనకు ఆ ఆర్టికల్ అడ్డుకాకుండా చూడాలి.
    • హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, నిట్ వరంగల్, ఐఐటీ మెదక్, మెడికల్, పీజీ కాలేజీ వంటి కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థల్లో ఇరుప్రాంతాలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. 
    • ఐఐటీ, ఐఐఎం, కేంద్ర వ్యవసాయ విద్యాలయం, ఈఎస్‌ఐ ఆసుపత్రి, ఎయిమ్స్ తరహా వైద్యవిద్యకు యూనివర్సిటీని నెలకొల్పాలి.
    • ఇచ్చాపురం నుండి అనంతపురం దాకా 8 లేన్ల జాతీయ రహదారిని నిర్మించాలి. బెంగళూరు నుం డి అనంతపురం, నెల్లూరు, చిత్తూరును కలుపుతూ చెన్నైదాకా జాతీయ రహదారి నిర్మాణం చేయాలి.
    • గుంటూరు వద్ద వై జంక్షన్ నిర్మించాలి. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ ఇవ్వాలి.
    • విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటుచేయాలి. కొత్తగా నిర్మించే రాజధానిలోనూ, విశాఖలోనూ మెట్రో రైలును ఏర్పాటుచేయాలి.
    • విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలి. కోస్తాలో ఓడరేవుల అభివృద్ధి చేయాలి.
    • రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటుచేయాలి.
    • గిరిజనాభివృద్ధి బోర్డును, కడపలో పారిశ్రామిక జోన్‌ను ఏర్పాటుచేయాలి. పెట్రో కారిడార్‌ను విస్తృతపర్చాలి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement