సేంద్రియ సేద్యానికి చుక్కాని.. గార్బేజ్ ఎంజైమ్! | Garbage enzyme to organic farming | Sakshi
Sakshi News home page

సేంద్రియ సేద్యానికి చుక్కాని.. గార్బేజ్ ఎంజైమ్!

Published Tue, Jun 23 2015 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

సేంద్రియ సేద్యానికి చుక్కాని.. గార్బేజ్ ఎంజైమ్!

సేంద్రియ సేద్యానికి చుక్కాని.. గార్బేజ్ ఎంజైమ్!

* కూరగాయలు, పండ్ల వ్యర్థాలకు కొంచెం నల్లబెల్లం కలిపి మురగబెడితే చాలు..
* 90 రోజుల్లో ద్రావణం సిద్ధం.. 6 నెలలు నిల్వ చేసుకునే అవకాశం
* పంటల సాగులో ఎరువుగా, చీడపీడల మందుగా, శిలీంద్ర నాశినిగా ఉపయోగం
* పశుపోషణకు, కోళ్ల పెంపకానికీ ఉపయోగం
* ఇలు, మరుగుదొడ్డి పరిశుభ్రతకూ ఎంచక్కా వాడొచ్చు
* ఇదీ థాయ్‌లాండ్‌కు చెందిన డా. రోసుకాన్ అద్భుత ఆవిష్కరణ

 
పండ్లు, కూరగాయల తొక్కలు, ముక్కలను చెత్త బుట్టలో వేసి చేతులు కడుక్కుంటున్నాం. కానీ, థాయ్‌లాండ్‌కు చెందిన రోసుకాన్ మాత్రం ఆ పని చేయటం లేదు. కేవలం వంటింటి సేంద్రియ వ్యర్థాలు, కొంచెం బెల్లంతో సేంద్రియ సేద్యానికి, పశువుల దాణా తయారీకి.. ఇంటిపరిశుభ్రతకు ఇంకా అనేక రకాలుగా అద్భుతంగా ఉపయోగపడే ఒకానొక సేంద్రియ ద్రావణాన్ని ఆవిష్కరించారు. దాని పేరే ‘గార్బేజ్ ఎంజైమ్’. వ్యవసాయంలో పట్టభద్రురాలైన ఆమె తాను రూపొందించిన ‘గార్బేజ్ ఎంజైమ్’ ద్వారా థాయ్‌లాండ్‌లో సేంద్రియ వ్యవసాయోద్యమ వ్యాప్తికి 40 ఏళ్లుగా అవిశ్రాంతంగా పాటుపడుతున్నారు. ఈ ఎంజైమ్ వాతావరణ కాలుష్యాన్ని, భూతాపాన్ని తగ్గిస్తుంది. వాతావరణంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. ఆమె కృషికి మెచ్చి ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) పదేళ్ల క్రితమే రోసుకాన్‌ను విశిష్ట సేంద్రియ రైతుపురస్కారంతో సత్కరించింది.. గార్బేజ్ ఎంజైమ్ ప్రయోజనాలెన్నో.. ‘సాగుబడి’ పాఠకులకు అందిస్తున్నాం..
 
 కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు.. మార్కెట్లలో చెత్తకుప్పలో పోసిన మిగలపండిన పండ్లు, కూరగాయలు వంటివి ఎందుకూ పనికిరాని వ్యర్థాలే కదా అని అనుకోనక్కర్లేదు. వీటికి కొంచెం నల్లబెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ పంచదార కలిపితే 90 రోజుల్లో గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది. తద్వారా సేంద్రియ ఆహారంతోపాటు కాలుష్య ర హితమైన పర్యావరణాన్నీ పొందవచ్చు. అంతేకాదు ఇళ్లు, మరుగుదొడ్ల శుద్ధికీ వాడుకోవచ్చంటున్నారు ఈ ఎంజైమ్‌ను కనిపెట్టిన థాయ్‌లాండ్‌కు చెందిన డాక్టర్ రోసుకాన్ పూమ్‌పాన్‌వాంగ్. 40 ఏళ్లలో ప్రస్థానంలో దీనికి ఉన్న అనేకానేక ప్రయోజనాలను గుర్తించి, ఆచరణలో నిగ్గు తేల్చి.. ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచుతున్నారు.
 
 గార్బేజ్ ఎంజైమ్ తయారీ ఇలా..
 మూత బిగుతుగా పెట్టడానికి వీలుండే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ముల్లో దీన్ని తయారు చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు : కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, ముక్కలు, కుళ్లినవి) 3 పాళ్లు + నల్ల బెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ(బ్రౌన్) పంచదార 1 పాలు + నీరు 10 పాళ్ల చొప్పున కలపాలి. మార్కెట్లు, దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి వాడుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపొచ్చు. అయితే, జారుగా ఉండే గ్రేవీ కలపకూడదు. మాంసం, మందంగా ఉండే పనస పండ్ల తొక్కలు కలపకూడదు.
ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి గాలి చొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగలకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. మొదటి 30 రోజుల పాటు.. రోజుకోసారి మూత తీసి వాయువులు బయటకు వెళ్లాక, మళ్లీ గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడకట్టి, నిల్వ చేసుకొని అక్కడి నుంచి 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చే వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు లేదా మళ్లీ గార్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడుకోవచ్చు.
 
 ఆమె జీవితం సేంద్రియ సాగుకు అంకితం!

 థాయ్‌లాండ్ సేంద్రియ వ్యవసాయానికి చుక్కాని డాక్టర్ రోసుకాన్ పుంపవాంగ్. 1970ల్లో ఆవిడ వ్యవసాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు. విద్యనభ్యసించే రోజుల్లోనే రసాయన సేద్యం ఏ విధంగాను ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది కాదనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. రసాయన రహిత సేద్యంపై రోసుకాన్ క్షేత్రస్థాయిలో సుదీర్ఘ పరిశోధన చేసే క్రమంలో గార్బేజి ఎంజైమ్‌ను రూపొందించారు. స్వల్ప ఖర్చుతో, అందుబాటులోని వనరులతో చేయదగిన ఈ ద్రావణం ప్రయోజనకరమని గుర్తించారు. ఇది భూమిలో ఉండే సూక్ష్మజీవులకు శక్తినివ్వటంతో పాటు పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. పందులకు, కోళ్లకు దాణాతో కలిపి పెట్టినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి.
 
 1997 నుంచి రేయాంగ్ ప్రావిన్స్ కేంద్రంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణనిస్తున్నారు. ప్రత్యామ్నాయ వైద్య రీతుల్లో ఆమె డాక్టరేట్ చేశారు. ప్రకృతి హితమైన సేద్యంతో పాటు ప్రకృతి వైద్యం కూడా ఆమె నేర్పిస్తారు. అందుకే తన క్షేత్రానికి ‘ఆరోగ్య కేంద్రం’ అని రోసుకాన్ పేరు పెట్టారు. వారానికి మూడు గ్రామాల్లో సేంద్రియ సేద్యంపై శిక్షణనిస్తున్నారు. దీనికోసం మొబైల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దూర గ్రామాల నుంచి కూడా ప్రజలు ఈ ఆరోగ్య క్షేత్రానికి వచ్చి మొక్కల పెంపకం, పంటల సాగు, సేంద్రియ వ్యర్థాల పునర్వినియోగ పద్ధతులను నేర్చుకుంటున్నారు. 1984లో ఏర్పాటైన థాయ్‌లాండ్ సేంద్రియ వ్యవసాయదారుల సంఘానికి వెన్నుదన్నుగా నిలిచారు. థాయ్‌లాండ్‌తోపాటు చైనా, ఐరోపా దేశాల్లోని రైతులతో కలిసి పనిచేశారు.
 
 విషరహిత ఆహార పదార్థాలను కుటుంబానికి అందించేదే మంచి వంటిల్లు అని రోసుకాన్ దృఢ నమ్మకం. ఈ  విషయంలో థాయ్‌లాండ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలనేది ఆమె లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు గార్బేజ్ ఎంజైమ్‌ను ఆమె ముఖ్య సాధనంగా ఎంచుకున్నారు. ఆమె కృషిని గుర్తించి ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ 2003లో విశిష్ట సేంద్రియ రైతు పురస్కారంతో సత్కరించింది. ధన్యజీవి డా. రోసుకాన్‌కు జేజేలు..!
 
 పంటలకు పలు విధాలుగా ప్రయోజనం
 గార్బేజ్ ఎంజైమ్ లో ఉన్న సూక్ష్మజీవరాశి, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ ఎరువుగా, కీటకనాశనిగా పనిచేస్తుంది. తెగుళ్లు బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. దీన్ని వాడితే పంట మొక్కల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. గార్బేజ్ ఎంజైమ్‌ను నీటిలో తగిన పాళ్లలో కలిపి వాడుకోవాలి.
 ఎరువుగా.. 1:1000 పాళ్లలో కలిపి నేలలో పోయవచ్చు లేదా పిచికారీ చేయవచ్చు.
 పురుగులు/ తెగుళ్ల నాశినిగా.. 1:100 మోతాదులో కలిపి పిచికారీ చేయాలి.
 దిగుబడి పెంపుదలకు.. 1:500 పాళ్లలో కలిపి పిచికారీ చేయాలి.  
 
 మోతాదు ఎక్కువైనా నష్టం లేదు!
 డా. రోసుకాన్ ఐదేళ్ల క్రితం రవిశంకర్ గురూజీని కలిసి గార్బేజ్ ఎంజైమ్ ప్రభావశీలత గురించి తెలిపారు. అప్పటి నుంచి మేం దీన్ని వాడుతూ, నలుగురికీ చెబుతున్నాం. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒరిస్సాలలో వేలాది మంది రైతులు గార్బేజ్ ఎంజైమ్‌ను వాడుతూ మంచి ప్రతిఫలం పొందుతున్నారు. రైతులు వివిధ పంటలకు సాగు నీటితోపాటు 1:100 నుంచి 1:500 మోతాదులో పారగడుతున్నారు లేదా డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. జీవామృతం తయారీకి ఆవుపేడ, మూత్రం కావాలి. దీని తయారీకి అవేమీ అక్కర్లేదు. చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. కూరగాయ పంటలపై గార్బేజ్ ఎంజైమ్‌ను 3 దఫాలు పిచికారీ చేస్తున్నాను. కూరగాయ మొక్కల నారును పీకడానికి 2 రోజుల ముందు పిచికారీ(1:100 మోతాదు) చేస్తాను. 1, 2 తప్ప మొక్కలన్నీ బతుకుతున్నాయి. పూత దశలో రెండో దఫా పిచికారీ(1:50 మోతాదు) చేయడం వల్ల కాపు బాగా నిలుస్తున్నది. వారంలో కూరగాయలు కోస్తామనగా మూడో దఫా పిచికారీ(1:500 మోతాదు) చేస్తాను. కాయలు ఆకర్షణీయంగా రావటంతోపాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. గార్బేజ్ ఎంజైమ్ మోతాదు ఎక్కువైనా నష్టం లేదు.  
 - డా. బండి ప్రభాకరరావు (096119 22480),
 ప్రకృతి వ్యవసాయ నిపుణుడు,
 శ్రీశ్రీ సైన్స్ అంట్ టెక్నాలజీ ట్రస్టు, బెంగళూరు
 
 గార్బేజ్ ఎంజైమ్‌ను 4 నెలలుగా వాడుతున్నా
 కూరగాయలు, పండ్ల తొక్కలతో గార్బేజ్ ఎంజైమ్ తయారు చేసుకొని 4 నెలలుగా వాడుతున్నా. ఇంట్లో గచ్చును శుభ్రం చేయడానికి బక్కెట్ నీళ్లలో చెంచాడు కలుపుతున్నా. మరుగుదొడ్డిని శుభ్రం చేయడానికి యాసిడ్‌కు బదులుగా నీరు అసలు కలపకుండా గార్బేజ్ ఎంజైమ్‌ను వాడుతున్నా. ఇంటిపంటలపై బక్కెట్ నీటికి చెంచాడు కలిపి చల్లుతున్నా. కార్ క్లీనింగ్‌కు 1:500 మోతాదులో కలిపి వాడుతున్నా. చాలా మంచి ఫలితం ఉంది. క్లీనింగ్‌కు, ఇంటిపంటల సాగుకు రసాయనిక ఉత్పత్తుల అవసరమే లేదు. దీని తయారీకి 90 రోజులు పడుతుంది. 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. నిరుద్యోగులు, గృహిణులు, యువతీ యువకులు గార్బేజ్ ఎంజైమ్‌ను తయారు చేసి నిల్వ ఉంచి విక్ర యించడం ద్వారా ఉపాధి పొందవచ్చు.
 - సీహెచ్ ఉమామహేశ్వరి (90004 08907), విశ్రాంత బ్యాంకు అధికారిణి, హోమ్ గార్డెనింగ్ శిక్షకురాలు, సికింద్రాబాద్
 
 ఇంటిపనుల్లో ఉపయోగపడేదిలా..
 రోజువారీ ఇంటిపనుల్లోనూ గార్బేజ్ ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఒక లీటరు ద్రావణాన్ని రెండొందల లీటర్ల నీటికి(1:200) కలిపి ఎయిర్ ఫ్రెషనర్‌గా వాడవచ్చు. రెండు చెంచాల ద్రావణాన్ని బక్కెట్ నీళ్లలో కలిపి గచ్చును శుభ్రం చేస్తే హానికరమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. కుక్కర్, స్టవ్‌లపై మొండి మరకలను కూడా దీనితో తొలగించవచ్చు. టాయ్‌లెట్‌లు శుభ్రపరచేందుకు నీటిలో కలపకుండా గార్బేజ్ ఎంజైమ్‌ను నేరుగా వాడవచ్చు. ద్రావణం కలిపిన నీటిలో బట్టలు నానబెట్టి, ఉతకొచ్చు.  దీనితో ఒంటికి మర్దన చేసుకుంటే చర్మ వ్యాధులు తగ్గటంతో పాటు కొత్తగా రాకుండా కాపాడుతుంది. దీన్ని కలిపిన నీటిలో పెంపుడు జంతువులను శుభ్రంచేస్తే దుర్వాసన పోతుంది. దోమలు, బొద్దింకలు, ఎలుకలు రాకుండా చేసేందుకు ఈ ద్రావణం ఉపయోగపడుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement